గృహ వాస్తు సంపూర్ణ సమాచారం

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని మన పెద్దలు ఊరకే అనరు. దీని అర్థం ఏమిటంటే, పెళ్లి చేయడం ఎంత కష్టమో, ఇల్లు కట్టడం కూడా అంతే కష్టం అని వారి అర్థం. ఒకవేళ ఎవరైనా ఈ రెండు కార్యక్రమములూ ముగించినట్లయితే వారు ధన్యులైనట్టుగా భావించేవారు. ఈ రెండూ ముగిసిన తర్వాత, కష్ట సాధ్యమైన కార్యక్రమములను అలబోకగా చేశాడని, అదే పెద్దలు కితాబు ఇస్తూ ఉంటారు.

తెలుగు లో గృహ వాస్తు

ఏమైనా సరే పెద్దలు అనగా దైవ సమానులని అర్థం చేసుకోవాలి. వారు నిరంతరం మన మంచి కోరుతూ ఉంటారు, దైవంలాగా. ఇక్కడ ఒక చిన్న మార్పు ఏమిటంటే, పెద్దలు కనిపిస్తారు, దైవం కనిపించదు, అంతే తేడా. ఆంగ్లంలో గృహవాస్తు యొక్క సంపూర్ణ సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకున్నవారు ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. Detailed Gruha Vastu Information

గృహవాస్తు లో ప్రాముఖ్యమైన ఘట్టములు :

ఒక గృహం నిర్మించడం అంటే, ఒక “యజ్ఞం చేసినంత” అని పూర్వకాలంలో అనేవారు. ఆ రోజుల్లో గృహ నిర్మాణం అంటే, “ఊహించనలవికాని” ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అదే ఈ రోజుల్లో ఇలా డబ్బు పోస్తూ ఉంటే అలాగ మనకు కావాల్సినవన్నీ అనుకూలంగా చేసిపెట్టే ఎన్నో సంస్థలు, వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు. ఎంత ఎక్కువ మొత్తం ధనం వ్యయం చేస్తే అంత పెద్ద భవంతి తయారవుతుంది. పిండి కొద్ది రొట్టె. 

పూర్వకాలం సమాచార విప్లవం లేనందువల్ల ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలంటే ఇతరులపై ఆధారపడవలసి వచ్చేది లేదా పుస్తకాలను తిరగేయాల్సి వచ్చేది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కటీ మన చేతికి అందుబాటులోనే ఉంటున్నాయి, ఏది కావాలనుకున్నా, వెంటనే అది లభిస్తుంది, మన దగ్గర పైకం ఉండాలి అంతే. డబ్బులు ఉంటే కావాల్సినవన్నీ మన ఇంటి ముంగిటకు వచ్చేస్తాయి, కష్టం అనేది తెలియకుండా పోతోంది, సుఖం బాగా అధికమవుతోంది, అందుకే చాలామంది ప్రజలకు ఒక చిన్న కష్టం వచ్చిందంటే ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు, ప్రతి ఒక చిన్న కష్టానికి తల్లడిల్లి పోతున్నారు.

ప్రస్తుతం “మనిషి” చదవడాన్ని మరచిపోతున్నాడు, మరియు వీడియోలు చూడడానికి బాగా అలవాటు పడ్డాడు. చదవాలి అనుకున్నప్పుడు తనకు ఏమి కావాలో అది మాత్రం ఎంచుకొని దానిని శ్రద్ధగా చదవగలడు, అలా కాకుండా వీడియోల రూపంలో విషయాన్ని గ్రహిస్తాము అనుకుంటే రకరకాలైన ఇతర వీడియోలు మనిషిని తమ వైపు లాక్కోవడానికి శతదా ప్రయత్నం చేస్తాయి అందువల్ల తనకు కావలసిన దానికన్నా అనవసరమైన విషయాలకు వెళ్ళిపోతున్నాడు, తద్వారా తన విలువైన సమయాన్ని నాశనం చేసుకుంటున్నాడు. అందుకే మేము వీడియోలను ప్రోత్సహించడం లేదు మరియు వీడియోలను రిలీజ్ చేయడం లేదు. చదవమని మాత్రమే చెప్పడం జరుగుతున్నది, ఎందుకంటే బాధ్యత కలిగిన వారు మాత్రమే చదవడానికి మొగ్గు చూపుతారు. మేము బాధ్యత లేని వ్యక్తులను ఇష్టపడము.

స్థలం ఎంపిక మరియు గృహ నిర్మాణంలో పాటించాల్సిన జాగ్రత్తలు :

1. ప్రప్రథమంగా గృహ నిర్మాణానికి అవసరమయ్యే స్థలాన్ని ఎంచుకోవాలి. స్థలం ఎగుడు దిగుడుగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే, అనుభవజ్ఞుల సలహా తీసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఈ కార్యక్రమము మీ జీవితంలోనే అత్యంత ప్రాముఖ్యమైన సంఘటన. ఏ చిన్న పొరపాటు చేసినా జీవితాంతం గృహస్తులు మరియు వారి తర్వాత తరం వారు ఆ ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. స్థలం ఉత్తమమైనదైతే ఉత్తమ ఫలితాలు, అధమమైనదైతే చెడు ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.

2. ఒకవేళ మీరు కొనబోయే స్థలం లో గుంతలు ఉన్నట్లయితే, అవి ఏ దిశలో ఎంత లోతులో ఉన్నాయో జాగ్రత్తగా గమనించి తదుపతి నిర్ణయం తీసుకోగలరు. దయచేసి స్థలం ఎంపిక విషయంలో రాజీ పడవద్దు ఒకవేళ అలా జరిగితే జీవితాంతం రాజీ పడవలసి ఉంటుంది. నిపుణులతో పరిశీలన చేయించుకుంటే ధనం ఖర్చు అవుతుందని, వారికి ఇచ్చే రుసుము మిగిలించుకోవాలనే ఉద్దేశంతో “చాలా కొద్ది మంది” గృహస్తులు తమకు వాస్తు బాగా తెలుసని, గృహ వాస్తు ప్లాన్లను, (ఇంటి నమూనాలను) కొందరు తెలిసి తెలియనటువంటి వాస్తు వ్యక్తులచే పరిశీలింప చేయించుకుని ఆ తర్వాత వచ్చే చెడు ఫలితాలను అనుభవిస్తూ వాస్తు శాస్త్రమును, వాస్తు పండితులను నిందిస్తూ జీవితాన్ని ఆయాసంతో, ఎంతో బరువుగా, ముందుకు లాక్కుపోతూ ఉంటారు. ఇటువంటి వారి వల్ల భూమికి భారం, అంతే తప్ప, ఏ ప్రయోజనం ఉండదు.

తెలివైన వారు, విద్యావంతులు,  జ్ఞానం ఉన్న వాళ్ళు ఇటువంటి ఆలోచన కూడా చేయలేరు. మంచి ఆలోచన ఉన్నవారు తమ జీవితంలో ఏదైనా సాధించుకోవాలనే తపనతో నిరంతరం సన్మార్గాలకై ఎంతైనా శ్రమకోర్చి అన్వేషిస్తూ ముందుకు సాగుతారు. చవక బారు ఆలోచన చేయరు. ముఖ్యంగా ఇతరులను నిందిస్తూ కాలం గడపరు. అదే వీరి లోని గొప్పతనం. వీరు ఎటువంటి రుసుములకు వెరవక ఏ విషయంలోను రాజీపడక అద్భుతమైన స్థలమును సొంతం చేసుకుని ఆపై గృహ నిర్మాణాన్ని కానిస్తారు. జీవితంలోని సంతోష మాధుర్యాన్ని అనుభవిస్తారు. వీరు ఆదర్శప్రాయులు. ఉదాహరణకు విదేశాలలో నివసిస్తున్న మన భారతీయులు. ఎన్ని రకాలైన ఇబ్బందులు ఎదురైనా సరే, “నాణ్యత” విషయంలో రాజీపడరు. ఖర్చుకు వెనకాడరు.

చతురస్రాకార స్థలము – ఉత్తమ ఫలితాలు : 

3. గృహ నిర్మాణానికి చతురస్రాకార స్థలము ఎన్నుకోవడం అత్యుత్తమము, ఇది సకల శుభాలకు ఆరంభం, సర్వదా శ్రేయస్కరం. మీ కోసం ఇక్కడ ఒక నమూనా పటాన్ని ప్రదర్శించడమైనది. స్థలం ఎంత విశాలంగా ఉంటే గృహస్థులు అంత ఐశ్వర్యవంతులుగా ఉండే అవకాశం అధికం. మనందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం జనాభా పెరుగుతోంది, స్థలమేం పెరగడం లేదు. ఈ పరిస్థితులలో పెద్ద పెద్ద స్థలములు కావాలి అంటే విపరీతమైన ధనవ్యయం అవుతుంది. అంతంత సొమ్ము అందరూ భరించాలంటే, మాటలు కాదు ఉచితంగా దొరకడానికి. డబ్బు, ప్రపంచాన్ని నడిపిస్తున్న డబ్బు కావాలి. ఉన్నంతలో సర్దుకోవాలి.

చతురస్రాకార స్థలము

సమకోణ దీర్ఘ చతురస్రాకార స్థలము – ఉత్తమ ఫలితాలు :

4. దీర్ఘ చతురస్రాకార స్థలము మంచి ఫలితాలను గృహస్తులకు ప్రసాదించగలదు. తీసుకోబోయే స్థలమునకు ఇతర ఏ భయానకమైన పరిసర వాస్తు దోషాలు లేకపోతే ఈ దీర్ఘ చతురస్రాకారపు స్థలము అద్భుతమైన ఫలితాలను గృహస్తులుకు అందివ్వగలదు. కొన్నిసార్లు చతురస్రాకారపు స్థలము కన్నా, దీర్ఘ చతురస్రాకార స్థలము అధికమైన ఉత్తమ ఫలితాలను ఇవ్వడం కద్దు. సాధారణంగా మనకు చతురస్రాకారపు స్థలముల కన్నా, దీర్ఘ చతురస్రాకార స్థలములే అధికముగా కనిపిస్తూ ఉంటాయి. తొందరపాటు లేకుండా నిదానముగా ప్రతి ఒక్క విషయమును గమనించి ఘనమైన స్థలమును సొంతం చేసుకొని అందులో మీ స్వప్న సహకారమైనటువంటి భవంతిని నిర్మించుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

దీర్ఘ చతురస్రాకార స్థలము మరియు వాస్తు

మూలలు పెరిగిన స్థలం – వాస్తు ప్రభావములు : –

5. ఒకవేళ ఇటువంటి స్థలములు మాత్రమే లభ్యమయి ఇక వేరే ఉత్తమమైన స్థలములు లభించని పరిస్థితులలో, అనుభవజ్ఞుల సలహాలు పొంది పెరిగిన వాయువ్య భాగమున చిన్నపాటి పొదలను పాదుకొని, ఆ స్థలం “కోత పెట్టుకోవడం” వల్ల ఆ దోషం తొలగును. ఇటువంటి స్థలములకు “ప్రహరీ ఉన్నట్లయితే”, గృహస్థులకు కష్టాలు సంభవించే అవకాశం ఎక్కువగా కానవస్తున్నది. ఒకవేళ ఇంటికి ప్రహరీ ఉన్నట్లయితే, ఈ సమస్యను అధిగమించడానికి, ఈ పెరిగిన వాయువ్య భాగంలో ఒక చిన్నపాటి ఉప ప్రహరిని నైరుతి నుండి వాయవ్యమునకు “0°” వచ్చులాగున వేసుకోవడం వల్ల ఉపశమనం కలగవచ్చు. 

అపసవ్య స్థలం వాస్తు పరిణామాలు

ఒకవేళ మూలలు పెరిగిన స్థలములు మాత్రమే లభించినట్లయితే, లేదా ఒక స్థలమునకు ఏదో ఒక మూల పెరిగినట్లయితే, ఏ మాత్రం జాగు చేయక, వాస్తు బాగా తెలిసిన వారితో కూలంకషంగా సంప్రదించి తగిన సలహాను పొందడం శ్రేయోధాయకం. ఎందుకైనా మంచిది స్థలం కొనే ముందే ఒక వాస్తు సిద్ధాంతి గారి సలహా  తీసుకోవడం శుభలక్షణము. గృహం లేదా స్థలం కొనే ముందు అనుభవజ్ఞుల మాట వినడం సర్వశ్రేయోదాయకం. నిదానమే ప్రధానం. అనుభవజ్ఞుల మాటను గౌరవించండి. మీ జీవితం పూల పాన్పు అవుతుంది. ఉన్నంతలో మంచి స్థలం కోసమై శోధించి, సాధించి, జీవితాన్ని అమృతమయం చేసుకోవాలి.

సమాంతర చతురస్ర లేదా అపసవ్య చతురస్ర స్థలములు : –

6. ఈ చిత్రపటమును జాగ్రత్తగా గమనిస్తే రెండు ప్రదేశాలలో లేత సింధూర వర్ణము చాలా చిన్నపాటిగా కనిపిస్తుంది. ఈ చిత్రపటమునకు ఈ లేత సింధూర వర్ణము గుర్తు దేనికనగా, ఈ చిత్రంలోని రెండు ప్రదేశాలలో ఈ స్థలమునకు మూల ప్రాంతం లోపించినది. మొదటిది ఈశాన్యం రెండవది నైరుతి. వీటిని చతుర్భుజ స్థలములని భావించుకొని ఏమాత్రం ఆలోచన చేయక డబ్బు పోసి స్థలములను కొంటారు. సాధారణంగా గృహమునకు ఈశాన్యము, నైరుతి లోపించడం అనగా ఇదే గృహమునకు ఆగ్నేయ వాయువ్యం పెరిగినట్టుగా మనకు బాగా స్పష్టంగా అర్థం అవుతుంది. దయచేసి ఈ చిత్రంలోని లేత సింధూర వర్ణమును మరొకసారి గమనించగలరు. దీని అర్థం ఏమిటంటే ఇంటి లోపల లేదా స్థలం లోపల ఈశాన్య, నైరుతి భాగాలు లోపించాయి అయితే అదృశ్య రూపంలో ఈ కోత ఉండడం వల్ల అధిక శాతం గృహస్థులు గమనించలేరు.

ఇల్లు వాస్తు దోషాలు

ఆగ్నేయ వాయవ్యాలు ఏదైనా గృహమునకు పెరిగినట్టు అయితే ఆ గృహములో శుభ ఫలితాలు రావడం అరుదు. అంతేకాకుండా ఎప్పుడు చూసినా ఏదో ఒక కొత్త వ్యవహారం రావడం జరగవచ్చు. లేదా పాత వ్యవహారములు తిరిగి ఎదుర్కోవలసిరావచ్చును. ఇటువంటి గృహములలో నివసించే వారు బాగా ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటంటే, ఇటువంటి స్థలములలో, గృహ నిర్మాణం అయిన తర్వాత, అంత త్వరగా ఈశాన్య నైరుతి భాగాలు లోపించినట్టుగా తెలియదు. ఇంటిలోని వారు ఇబ్బందులకు గురి అవుతూ, ఇంటి లోపల ఏదో ఒక వాస్తు మార్పులు చేసి సరైన ఫలితాలు రాక వాస్తు శాస్త్రంను లేదా వాస్తు సిద్ధాంతాలను నిందించడం జరుగును. ఇక్కడ అసలు తప్పు ఎవరిది?

ప్రస్తుతం చాలా మంది పనికిరాని పనుల విషయంలో చాలా బిజీగా ఉంటున్నారు. అదే, సోషల్ మీడియా. రిటైర్ అయిన వాళ్ళకి సోషల్ మీడియా ఒక అద్భుత వ్యాపకం అని చెప్పాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో ఉన్న వారికి ఇదొక విషపురుగనే చెప్పాలి. జీవితాలను సర్వనాశనం చేస్తోంది, ఈ సోషల్ మీడియా. ఒకవేళ మీకు ఇటువంటి అవ లక్షణాలు లేకపోతే, మరియు ఒక రెండు నిమిషాల విశ్రాంత సమయం ఉన్నట్లయితే, పై చిత్రపటమును జాగ్రత్తగా గమనించండి. ఈశాన్య, నైరుతి  కోల్పోయిన స్థలాలు లేదా గృహాలు మనిషిని ఒక్కోసారి నరకకూపంలోకి లాగవచ్చును. ప్రాణం తీయదు, కానీ, ఎప్పుడూ ఏదొక సమస్యలు వస్తూనేవుంటాయి. దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడవచ్చును.

బాధ్యత తెలిసిన వాళ్ళు ఇతరులను నిందించకుండా, తాము వేసే ప్రతి అడుగు పది సార్లు ఆలోచన చేసుకుని వేస్తుంటారు. వీరు చేసే పనులు చూసేవారికి విచిత్రంగా అనిపించవచ్చు, కానీ వీరి జాగ్రత్తలే, వీరికి శ్రీరామరక్ష. ఇతరులను నిందిస్తూ కాలం గడిపే వాళ్ళు అక్కడనే ఉంటారు, లేదా కిందికి పడిపోతూనే ఉంటారు. ఎవరిని పట్టించుకోక ఏ విషయాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళు, ఇతరుల గురించి ఆలోచన చేయకుండా నిరంతరం శ్రమించే వాళ్ళు, దిన దినాభివృద్ధి చెందుతూ ఇతరులకు ఆదర్శంగా నిలబడతారు. ఇలాంటి వారిని చూసైనా మారితే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది.

7. కొన్ని స్థలములకు కొన్ని దిశలలో పల్లంగానూ (లోతుగా), లేదా మిర్రుగాను (ఎత్తుగా) ఉండటం కద్దు. ఉదాహరణకు తూర్పు భాగం లేదా ఉత్తరభాగం, లేదా ఈశాన్య భాగం స్థలము పల్లముగా ఉంది అంటే మీ పంట పండినట్టే అని అర్థం చేసుకోవాలి. ఇటువంటి స్థలములు సాధారణంగా “జన సమ్మతమైనటువంటి” వరాలను లేదా కోరికలను నెరవేరుస్తుంది. కావున మీరు తీసుకోబోయే స్థలమునకు ఉత్తర లేదా తూర్పు లేదా ఈశాన్య భాగాలు పల్లంగా ఉంటే అద్భుతం అని తెలుసుకొని కాస్త ధర ఎక్కువైననూ ఇటువంటి స్థలములను కొనడం సమ్మతమే.

8. మీరు కొనబోయే స్థలమునకు పశ్చిమ భాగం లేదా నైరుతి భాగం లేదా దక్షిణ భాగం బాగా మిర్రుగా ఉన్నట్లయితే అది మీ ఇంట సిరులను పండిస్తుందని తెలుసుకోవాలి. మహాభాగ్యమును ప్రసాదిస్తుందని అర్థం చేసుకోవాలి. 

ఉత్తర, దక్షిణ రహదారులు గల స్థలం కొనవచ్చునా?

7. ఈ చిత్రంలో స్థలమునకు రెండు రహదారులు కలవు. ఉత్తర దిశ, దక్షిణ దిశ రహదార్లు. కొందరి అనుమానం ఏంటంటే. ఇలాగా రెండు రహదారులు ఉన్న స్థలమును కొనవచ్చునా? అని, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వాస్తు రీత్యా మంచి రహదారులు ఉన్న స్థలమును కొనవచ్చును. ఇతర ఏ వాస్తు దోషములు లేనట్లయితే ఇటువంటి ఉత్తర మరియు దక్షిణ రహదారులు గల స్థలమును కొనడం మంచిది. వాస్తు దోషం ఉన్న స్థలమును కొనరాదు. ఉదాహరణకు దక్షిణ రహదారి విపరీతమైన పెద్దగా, పల్లంగా ఉండి, ఉత్తర రహదారి అతి చిన్నగా, మెరకగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు అనుకున్నరీతిలో రాకపోవచ్చు, లేదా మంచి ఫలితాలు రావడానికి ఊహించని ఆలస్యం కావచ్చు.

వాస్తు లో రెండు రోడ్ల స్థలము

తూర్పు పడమర రహదారులు గల స్థలం కొనడం మంచిదేనా?

8. ఒక స్థలమునకు తూర్పు మరియు పడమర రహదారులు ఉన్నట్లయితే ఆ స్థలమును మంచి స్థలముగానే పరిగణించాల్సి వస్తుంది. కొనబోయే స్థలము వాస్తుకు అనుకూలంగా ఉన్నట్లయితే ఉత్తమ ఫలితాలు పొందగలరు. అలాకాకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చును. ఉదాహరణకు తూర్పు రహదారి చాలా చిన్నగా, మెరకగా ఉండి, పడమర రహదారి విపరీతమైన వైశాల్యంతో మరియు పల్లంగా ఉన్నట్లయితే, ఉత్తమ ఫలితాలను పొందడం ఇబ్బందని చెప్పుకోవాల్సి ఉంటుంది, లేదా, చాలా ఆలస్యంగా మంచి ఫలితాలు రావచ్చు లేదా రాకపోవచ్చు. ఒక్కోసారి ప్రతికూలమైన ఫలితాలు కూడా రావచ్చు.

తూర్పు మరియు పశ్చిమ రహదారులు

తూర్పు, పశ్చిమ, దక్షిణ 3 రహదారుల స్థలము / ఇల్లు కొనవచ్చునా?

9. ఈ చిత్రంలో చూపినట్టుగా ఒక స్థలమునకు మూడు రహదారులు ఉన్నట్లయితే అనగా పశ్చిమ దక్షిణ తూర్పు రహదారులు ఉండి ఉత్తరం నందు రహదారి లేనట్లయితే ఇటువంటి స్థలములను కొనక పోవడమే మంచిది. సాధారణంగా ఇటువంటి గృహములలో చికాకు కలిగించే పరిస్థితులు ఎక్కువగా ఉండవచ్చు. అంతేకాకుండా ధనార్జన మూలాలు కనుమరుగయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల అభివృద్ధి విషయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గృహస్తుల ఆరోగ్యం విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కానవస్తున్నాయి.

 

తూర్పు పశ్చిమ దక్షిణ 3 రహదారులు

స్థలానికి ఉత్తర, పశ్చిమం, దక్షిణ రహదారులు ఉన్నట్లయితే కొనవచ్చునా?

10. ఈ పటమునందు కనిపించే స్థలము లేదా గృహమునకు మూడు రహదారులు కలవు. ఉత్తర, పడమర, మరియు దక్షిణ రహదారులు కలవు. సాధారణంగా ఇటువంటి గృహములు, అందు నివసించే గృహస్తులకు శుభములు చేకూర్చవు. ఒకవేళ గృహస్తులు ఇటువంటి స్థలములను కొనవలసి వస్తే ఒక అనుభవజ్ఞుడైన వాస్తు సిద్ధాంతిని సంప్రదించి తగిన సలహా పొందగలరు. ఈ స్థలం లేదా ఈ గృహం విషయంలో అనుభవజ్ఞుల, మాట సహాయం తీసుకోవడం వల్ల మీ జీవితం అమృతమయం కాగలదు.

స్థలానికి ఉత్తర, పశ్చిమం, దక్షిణ రహదారులు ఉన్నట్లయితే కొనవచ్చునా?

పడమర, ఉత్తరం, తూర్పు రోడ్లు గల స్థలం తీసుకోవచ్చా?

11. మీరు చూస్తున్న ఈ స్థలం లేదా గృహమునకు మూడు రహదారులు కలవు. ఒకటి పడమర, రెండవది ఉత్తరము, మూడవది తూర్పు రహదారి. సాధారణంగా ఇటువంటి స్థలములు లేదా గృహములు అద్భుతమైన ఫలితాలను, గృహస్థులకు అందించగలవు. ఒకవేళ మీ దృష్టిలో ఇటువంటి స్థలములు లేదా ఇల్లు అమ్మకమునకు వచ్చినట్లయితే ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఒక మంచి అనుభవజ్ఞుడైన వాస్తు సిద్ధాంతిని సంప్రదించి కోనవచ్చును. ఒకవేళ మీరు ఉన్న ఇల్లు వాస్తుకు అద్భుతంగా ఉండి, ఇటువంటి మూడు రహదారులు గల స్థలం లేదా గృహము అమ్మకమునకు వచ్చినప్పుడు పెట్టుబడి ఆస్తిగా కూడా మీరు దీనిని కొనవచ్చును.

పడమర, ఉత్తరం, తూర్పు రోడ్లు గల స్థలం తీసుకోవచ్చా?

ఉత్తరం, తూర్పు, దక్షిణం రోడ్లు గల స్థలం కొనుగోలు చేయవచ్చునా?

12. ఈ పటంలో చూపించిన విధంగా ఉత్తరం, తూర్పు, మరియు దక్షిణం రహదారులు గల స్థలం అమ్మకమునకు ఉన్నట్లయితే ఇటువంటి స్థలము లేదా గృహమును నిరభ్యంతరంగా కొనవచ్చును. అయితే ముందు జాగ్రత్తగా ఒక అనుభవజ్ఞుడైన వాసు స్థపతిని సంప్రదించి తరువాత కొనండి. ఒక్కసారి ఇటువంటి స్థలములకు అనానుకూలమైనటువంటి పరిసర వాస్తు యొక్క చెడు ఫలితములు ఉండవచ్చు, అటువంటి వివరములు అన్నింటినీ అనుభవజ్ఞులు మాత్రమే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోగలరు. సాధారణంగా ఇటువంటి నివాసములు ఉత్తమఫలితాలను ప్రసాదిస్తాయి.

ఉత్తరం, తూర్పు, దక్షిణం రోడ్లు గల స్థలం కొనుగోలు చేయవచ్చునా?

ఇటువంటి  స్థలములు లేదా గృహములకు కీడుచేసే పరిసర వాస్తు ప్రభావములు లేకపోతే, ఇటువంటి స్థలములను లేదా గృహములను నిరభ్యంతరంగా కొనవచ్చు.  ఇటువంటి స్థలముల యందు వాస్తు శాస్త్ర ప్రకారంగా గృహమును నిర్మించుకున్నట్లయితే వారు మహాభాగ్యమును పొందగలరు. ధన్యులగుదురు.

నాలుగు రోడ్లు గల స్థల ప్రభావం ఎలా ఉంటుంది?

13. ఒక స్థలమునకు లేదా గృహమునకు ఈ చిత్రంలో చూపిన విధంగా నాలుగు రహదారులు నాలుగు దిక్కులలో ఉన్నట్లయితే, ఇటువంటి గృహములను రాజగృహములు అని సంబోధించే నానుడి కలదు. ఒక గృహమునకు తూర్పు, పడమర, ఉత్తర, మరియూ దక్షిణాలలో రహదారులు ఉన్నట్లయితే ఇది మహా భాగ్యమును, కీర్తి, యశస్సును ప్రసాదించును. ఇందులోని గృహస్తులకు గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి ధనవంతులై,  వీరి మాటకు గౌరవం లభిస్తూ, వీరి ప్రతిష్టను సర్వదా ద్విగుణీకృతమయేలాగున ఇటువంటి గృహాలు ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇంటా, బయట వాస్తు బాగా ఉంటే, జీవితం కలలు కనే మంచి అనుభవాల ఒక పూల బాటే.

నాలుగు రోడ్లు గల స్థల ప్రభావం ఎలా ఉంటుంది?

స్థలం కాకుండా గృహం కూడా వాస్తు శాస్త్ర రీత్యా నిర్మితమైనట్లయితే వీరికి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.. అయితే అందరికీ ఇటువంటి స్థలములు లేదా గృహములు లభించవు. కోటికి ఒక్కరికి ఇటువంటి గృహము లభిస్తే లభించవచ్చు. ఇటువంటి స్థలములను వెతకటానికి, మార్పులు చేసి సిద్ధం చేయడానికి అందరికీ సాధ్యం కాకపోవచ్చు. తలరాత ఉన్న వారికి మాత్రమే, ఇటువంటి మహోన్నత నివాస భాగ్యస్థానాలు లభిస్తాయి.

ఇటువంటి నాలుగు రహదారులు కల స్థలములలో కూడా ఎన్నో రకాలైనటువంటి కలయికలు మరియు ప్రస్తారణలు ( కాంబినేషన్స్ ) కలవు. పొరపాటు చేయడం అనేది మంచిది కాదు, ఇది జీవితము. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకొని తీసుకునే నిర్ణయము సమంజసంగా ఉండాలి. ఇటువంటి స్థలములు లభించినప్పుడు, వాస్తు బాగా తెలిసిన ఒక వ్యక్తి  చేత సలహా “తీసుకోకపోవడం” అనేది ఎలా ఉంటుందంటే, “లక్ష్మీదేవి ఇంటికి వచ్చి తలుపు తడితే” ప్రస్తుతానికి మేము పని మీద ఉన్నాము రేపు రా అన్నట్టుగా ఉంటుంది. ఎవరికి ఎంత ప్రాప్తమో అది మాత్రమే వారికి లభిస్తుంది, అలాగని ప్రయత్నం చేయకుండా ఉండడం సరైనది కాదు.

1992వ సంవత్సరం నుంచి బలంగా ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా కాలానికి  మాకు ( గృహస్తులకు ) ఇటువంటి 8 స్థలాలు లభించాయి. ఇందులో గృహాలు నిర్మించిన వారందరూ ( ఒకటి మాత్రం కర్మాగారం ) చాలా అద్భుతమైన ఫలితాలను పొందడం వల్ల పుస్తక పఠనం ద్వారా వచ్చిన విషయపరిజ్ఞానమును మరియు అనుభవపూర్వకంగా లభించిన విజ్ఞానమును క్రోడీకరించి ఇక్కడ తెలియజేయడం జరిగినది.

జీవితంలో మరచిపోలేని బాధాకరమైన సంఘటన

ప్రస్తావన వచ్చింది కాబట్టి, గడిచిపోయిన ఒక సంఘటనను ఇప్పుడు తలుచుకోవడం జరుగుతున్నది. 1997వ సంవత్సరంలో గుంటూరు నగరానికి దగ్గరగా ఒక గ్రామంలో ఇటువంటి 4 దారుల స్థలమును ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి, అన్ని సర్దుబాటు చేసి శుభమా అంటూ ఆ వాస్తు సిద్ధాంతి వెనుకకు వెళ్లి పోవటం జరిగింది. అయితే మరుసటి దినాన ఆ గృహస్థుడు మనసు మార్చుకున్నానని, తను ఆ స్థలంలో గృహం నిర్మించడం లేదని తెలియజేసి,  మాట్లాడుతూ ఉండగానే ఫోన్ పెట్టేసాడు. కంటి లో నీరు రాలేదు గాని, ఇంత శ్రమ పడింది ఇందుకోసమా అనిపించింది. ఒకపక్క కోపం, ఆవేదన, అసహాయత, ఆపై ఏమి మాట్లాడాలో తెలియదు.

అయితే తర్వాత రోజుల్లో తెలిసిన విషయం ఏంటంటే ఆ గృహస్థుడు ఈ నాలుగు రోడ్ల కూడలి స్థలం యొక్క విషయాన్ని ఊరిలో అందరికీ టాంటోం వేశాడు. గ్రామం అన్నాక “సరిపోయే” వాళ్ళు ఉండొచ్చు, “సరిపోని” వాళ్ళు ఉండొచ్చు. రాత్రికి రాత్రి, ఏం జరిగిందో తెలియదు కానీ, ఉదయం ఒక వాస్తు సిద్ధాంతి ఈ గృహస్థుని, ఇంటికి వచ్చి నాలుగు రోడ్ల కూడలి స్థలాలు తీసుకోకూడదు, అవి చాలా ప్రమాదకరము, అవి తీసుకుంటే పిల్లలు ….. అంటూ రకరకాలైన భయాలను అతని మెదడులోకి జొప్పించి, అనుమానబీజాలను నాటాడు. 15 నిమిషాలు కూడా గడవకముందే, ఇంకొక వ్యక్తి వచ్చి ఏంటి బాబు, నాలుగు రోడ్ల కూడలి ఇల్లు కడుతున్నావంట కదా, అది ఎంత ప్రమాదమో నీకు తెలుసా, అంటూ అగ్నికి ఆజ్యం పోశాడు. ఈ గృహస్థుని అనుమానము, అధిక బలాన్ని పొంది తను నిర్మించాలనుకుంటున్న నాలుగు రోడ్ల కూడలి గృహాన్ని వాయిదా వేసేసాడు. అప్పటికప్పుడు ఊరిలో రాజకీయం మారిపోయి, ఆ స్థలాన్ని ఇంకొకరు సొంతం చేసుకున్నారని, ఏవో మార్పులు గట్రా చేశారని విన్నాము, కానీ, పూర్తిగా వివరాలు లభ్యం కాలేదు. 

ఎంతోమంది రకరకాలుగా గ్రామాల గురించి అనుకుంటూ ఉంటారు, పల్లెలు ఎంతో ప్రశాంతంగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఉన్నత మనస్కులని, అందరూ అన్ని విధాల అనుకూలమైన సహకారము అందిస్తారని తలుస్తుంటారు. అయితే ఎన్నో గ్రామాలలో మేధావులు, అపర మేధావులు కూడా ఉంటారు. అయితే ఇటువంటి విషయాలు ఎక్కువ కాలం దాగవు కదా ఆ గృహస్థుడు తర్వాత కాలంలో విచారించగా నాలుగు రోడ్ల కూడలి స్థలం అంటే అద్భుతం అని తెలిసి వచ్చింది. ఎంత విలపిస్తే ఏం ప్రయోజనం, సమయం గడిచిపోయిన తర్వాత. అవకాశం చేయి జారి దాటిపోయిన తర్వాత. అందుకే కొందరు పెద్దలు ఒక నానుడిని బాగా చెబుతూ ఉంటారు. కుడి చెయ్యి చేసే పని ఎడం చేయికి తెలియకూడదు అని చెప్తూ ఉంటారు. ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాతనే పెద్దలు ఇటువంటి సామెతలు చెప్పారేమో అనిపిస్తుంది.

ఈ నాలుగు రోడ్ల కూడలి స్థలం విషయం ఊరిలో ఎవరికీ చెప్పవద్దు అని ఆరోజు జాగ్రత్తగా తెలియచేసినా, తాను ఇంకొక రీతిలో అర్థం చేసుకొని, నోటి దురుసు వల్ల, అనవసరమైన అనుమానాల వల్ల, ఊరిలోని వారికి ఉన్నవి లేనివి కలిపి, ఇది బంగారాన్ని పండిస్తుందంట,  నా జీవితం మారిపోతుంది,  నేను మహారాజు అనుభవించే జీవితాన్ని అనుభవిస్తానంట, అనే మాట చెప్పి చేతులారా జీవితాన్ని దురదృష్టం వెంటాడే లాగున చేసుకున్నాడు. అందుకే మహనీయులైన పెద్దలు ఒక మాట చెబుతూ ఉంటారు “అదృష్టవంతుణ్ణి ఎవరూ చెడగొట్టలేరు, దురదృష్టవంతుడిని ఎవరూ బాగు చేయలేరు” అని. అవకాశం తలుపు తట్టినప్పుడు అనుకూలం లేదనడం, కర్మ కాకపోతే ఇక ఏంటి. అయితే ఇదే గృహస్థుడు 1999లో చాలాసార్లు ఫోన్ చేసి ఒక్కసారి తమ గ్రామానికి వచ్చి కొన్ని స్థలాలు పరిశీలించాల్సిందిగా కోరడం జరిగింది. కళ్ళు (బుద్ధి) తెరుచుకోవడానికి ఇన్ని నెలలు కావాలా. నాలుగు రోడ్ల స్థలం గురించి పదే పదే గుచ్చి గుచ్చి అడిగినా దాటవేశాడే కానీ, వాస్తవం తెలపలేదు. అదో పీడకలగా మరిచిపోదామండీ అన్నాడే కానీ, వాస్తవం తెలపలేదు. దాని గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు.

ఒక నిధి దొరికిన తర్వాత దాని గురించి తెలిపితే ప్రభుత్వం వారికి తెలపాలి, అంతేకాని  ఇతరులకు తెలియజేయడం ఎంతవరకు సమంజసం. తెలివైన వారు తమకు ఒక నిధి దొరికిన తర్వాత ఏ మాత్రం శబ్దం చేయక అత్యంత జాగ్రత్తగా, భవిష్యత్తును స్వర్ణమయం చేసుకుంటారు. కొందరు, తమకు నిధి దొరికిందని అయిన వాళ్లందరికీ తెలిపి, ఉన్నది కాస్త ఊడగొట్టుకుంటూ ఉంటారు. ఇటువంటి విషయాలు మనం ఎన్నో వింటూ ఉంటాం.  అంతేకాదు వార్తాపత్రికల్లో కూడా చదువుతూ ఉంటాం.

గృహములో నేల హెచ్చు తగ్గులు - వాటి ప్రభావములు.

14. గృహము నందలి నేల లేదా గచ్చు హెచ్చుతగ్గులుగా ఉన్నప్పుడు వాటి శుభాశుభ ప్రభావములు అందు నివసించు గృహస్థులపై ఉంటుంది. ఈ విషయం బాగా అర్థం కావాలంటే ఉదాహరణకు ఒక తూర్పు ముఖ గృహం తీసుకుందాం. ఈ గృహంలో నైరుతి భాగంలో పడకగది మరియు ఈశాన్య భాగమున ముఖ ద్వారము ఉన్నట్టుగా ఊహించుకుందాం. ఈ నైరుతి పడకగది ఒక మూడు అడుగుల లోతుగా ఉన్నట్లయితే అనగా మూడు అడుగులు పల్లముగా ఉన్నట్లయితే, అందు నివసించే గృహస్తులపై ఈ నైరుతి యొక్క ప్రభావం స్పష్టంగా ఉండును. ఇటువంటి గృహాలలో శుభ ఫలితాలు రావడం అరుదు. ఒకవేళ శుభ ఫలితాలు వచ్చిననూ అవి స్వల్ప కాలం మాత్రమే అని గమనించాలి, లేదా చివరికి దుష్ఫలితాలను రుచి చూడవలసివుంటుంది.

దావణగెరె పట్టణంలో జరిగిన ఒక సంఘటన

అనుభవాలు మనకు ఎప్పటికీ ఎన్నో జాగ్రత్తలను నేర్పిస్తాయి. అందుకే సాధారణంగా పెద్దవాళ్లు ఏదైనా ఒక విషయాన్ని మొదలు పెట్టేటప్పుడు కానీ, ఇతరులతో సంభాషించేటప్పుడు కానీ, లేదా ఒక వ్యాపార విషయంలో మాట్లాడదలచుకున్నప్పుడు కానీ, ఎదుటివారి అనుభవం ఎంత అని అడుగుతుంటారు. ఇంతేనా, ఎక్కడ చూసినా అనుభవం ఎంత అని విచారించటం అనేది, సర్వసాధారణం. ఈ విచారణ అనేది ఎందుకోసమంటే అనుభవం బట్టి వారు ఎటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించగలరని ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా వాస్తు శాస్త్రవేత్తలకు చెప్పనలవి కానటువంటి అనుభవాలు ఉంటాయి, ప్రతి దినం ఎన్నో గృహాలను పరిశీలించి అందులో జరిగిన సంఘటనన్నిటిని బేరీజు వేసుకొని తిరిగి అటువంటి సమస్యలు ప్రజలకు రాకూడదనే ఉద్దేశంతో జాగ్రత్తలు తెలియజేస్తూ ఉంటారు. ఇది రివాజు.

గృహస్తులు కూడా ఒక వాస్తు సిద్ధాంతిని తమ గృహమునకు పిలిపించుకోవాలనుకున్నప్పుడు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాస్తు చూస్తున్నారు, అని అడగటం అనేది సర్వసాధారణం. ఒక వ్యక్తి గత ఐదు సంవత్సరాల నుంచి వాస్తు చూస్తున్నాను అన్నట్లయితే అతనిని కొంచెం తక్కువ నమ్మకంతో పిలిపించుకోవడానికి అవకాశం ఉండవచ్చు. అలాకాకుండా ఒక వ్యక్తి తను గత పది సంవత్సరాలుగా వాస్తు చూస్తున్నాను అని చెప్పినప్పుడు అతనిపై వీరికి విశ్వాసం బాగా పెరుగుతుంది, మరియూ నమ్మకం తో తమ గృహాన్ని పరిశీలింప చేయించుకుంటారు. ఒకవేళ ఒక వాస్తు సిద్ధాంతి 20 సంవత్సరాలుగా వాస్తు చూస్తున్నట్లయితే ఇక అతని విషయంలో ఏ అనుమానము లేకుండా వెంటనే గృహమునకు పిలిపించుకొని తగిన సవరణలు చేయించుకోవడం లేదంటే తగిన సూచనలు పొందడం గృహస్తులు చేయడం సర్వసాధారణం. ఇది పరిపాటి. 

ఏదైనా వాస్తు శాస్త్రవేత్త ఒక విషయాన్ని కొత్తగా పరిశోధన చేసి బయట ప్రపంచానికి తెలియజేసినప్పుడు అతను తన సహచర వాస్తు సిద్థాంతులచే, కొన్ని అవమానములను ఎదుర్కోవడం జరగవచ్చును. అంతేనా ఒక వాస్తు సిద్ధాంతి తను ఒక కొత్త విషయాన్ని కనుగొన్నప్పుడు అది బయటకు తెలియజేసే సమయంలో లేదా విమర్శలు వచ్చే సమయంలో తను పడే మానసిక వేదన వర్ణనాతీతం ఈ బాధ అనేది ఇటువంటి పరిశోధన కావించే వాసు సిద్ధాంతులకు మాత్రమే తెలుస్తుంది పుస్తకాలు చదివి ఇతరులను నిందించే వారికి ఇటువంటి ప్రయాసలు తెలియవు. ఈ క్రింది సంఘటనను గురించి తెలుసుకోవడం మంచిదనే ఉద్దేశంతో తెలియజేయడమైనది.

కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరె పట్టణంలో ( ఊరి పేరు మార్చడం జరిగినది ) ఒక కుటుంబం నివసించేది. వీరికి ముగ్గురు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు మరియు ఇద్దరు కుమార్తెలు  అమెరికాలో స్థిరపడ్డారు. ఇక మిగిలిన ఇద్దరు కుమారులు దావణగెరె పట్టణంలోనే, ఫైనాన్స్ బిజినెస్, మెడికల్ స్టోర్, తదితర వ్యాపారాలు  చేసుకుంటూ చాలా గౌరవప్రదంగా జీవించేవారు. వీరి కుటుంబానికి ఉన్న కీర్తి ప్రతిష్టల గురించి చెప్పనలవి కాదు. 

అత్యంత ధనవంతులు అని చెప్పలేము కానీ ధనవంతుల కిందికే వస్తారు. వీరి పెద్దబ్బాయి కి వివాహము ఉత్తర కర్ణాటక అమ్మాయితో నిర్ణయం చేసి, 1987 వ సంవత్సరంలో అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవాన్ని ముగించారు. అది మొదలు, వారికి విపరీతమైన కష్టాలు చుట్టుకున్నాయి. భరించ లేనటువంటి అనుకోని సంఘటనలు, ఆపదలు ఉత్పన్నమై, అత్యంత దారుణమైన సంఘటనలను ఎదుర్కొన్నారు. ఏ గృహస్థులకు కూడా ఇటువంటి పరిస్థితులు రాకూడదు అనేంత భయానకమైన కష్టం వాళ్ళు చూశారు. వాళ్ళ అనుకున్నది ఏమిటంటే ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఇంటిలో ఇటువంటి కీడు జరుగుతున్నదని తలచారు. ఆ తర్వాత ప్రతి దినము ఇంటిలో అశాంతి, గొడవలే. వచ్చిన అమ్మాయి, ఏమాత్రం వెరవక అత్త గారి జుట్టుపట్టుకుని బజారులోకి లాగేస్తానని చెప్పేది.

సమాజానికి భయపడి, ఎంతకాలం కలిసున్నా, ఇక తప్పని పరిస్థితులలో 1994 సంవత్సరంలో వీరు విడిపోవడం జరిగినది. ఇక్కడితో కష్టాలు తీరలేదు. రాను రాను అనుభవించలేనటువంటి కష్టాలు అధికమై ఆ ఇంటి అత్తగారు, తీసుకొని తీసుకొని మరణించింది. ఈమె భర్త సర్వము వదిలేసి సన్యాసం తీసుకున్నాడు. ఇక మిగిలినది చిన్న కుమారుడు మాత్రమే. అతను అత్యంత సాధారణమైన వివాహం చేసుకొని ఆ ఇంటిని వదిలేసి వెళ్లిపోయాడు. ఇక మిగిలినది పెద్ద కుమారుడు ఆయన భార్య వారికి జన్మించిన ఇద్దరు సంతానం. ఏం జరిగిందో తెలియదు కానీ పెద్ద కుమారుడు మొత్తం కుటుంబాన్ని అంతా వదిలేసి గుజరాత్ రాష్ట్రం కు పారిపోయాడు. ఇక మిగిలినది కోడలు మరియు వారిద్దరి సంతానం మాత్రమే.

 ఆ ఇంటిలో నైరుతిలో పడకగది కలదు. ఇది నాలుగు అడుగుల లోతుగా ఉన్నది. అనగా నైరుతి పల్లమైనది. అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు గల కుటుంబము దిక్కులేనిదై రోడ్డున పడింది. ఆ ఇంటికి ఆ కాలంలో ఎన్నో మార్పులు చేశారు, అయితే వారికి ఏ ఫలితము రాలేదు, వచ్చిన వారు ఈ నైరుతి పల్లం (గుంత ) గురించి వివరించక, ఇంటిలో దెయ్యం ఉందని, ఎవరో చెడుపు చేశారని, ఇంటిపై నరుడు పోయాడని, ఇతరత్రా పొంతన లేని విషయాలు చెప్పి వాస్తు పై విరక్తి పుట్టించారు.

ఇక మిగిలిన ఆ ఒక్కగానొక్క కోడలు తన ఇద్దరు పిల్లలను తీసుకొని మైసూరుకు వెళ్ళి స్థిరపడినది. ఆ గృహం కిరాయికి తీసుకున్న వారు నైరుతి గుంతలు పూడ్చేశారు. పల్లంగా వున్న నైరుతి గదిని బాగా ఎత్తు చేసుకొని, భాగ్యాన్ని అనుభవించారు. ఆ తర్వాత వారు ఆ ఇంటినే కొనేశారు.  ఆ ఇంటిలోని దయ్యం ఏ కీడు చేయక వీరికి తగిన సహాయ సహకారాలు అందించింది కాబోలు, గత 30 సంవత్సరాల నుండి ఆ దెయ్యం ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, లేదా ఆ దెయ్యానికి ఇంకో భూతం పట్టి ఉండవచ్చు. వినేవాడు వెఱ్ఱివాడు అయితే చెప్పేవాడు చైనావాడు అయ్యుండొచ్చు. వాస్తు శాస్త్రరీత్యా గృహమును ఎలా పరిశీలనగా, లోతుగా, చూడాలో తెలియక దెయ్యాలు, భూతాలు అనటం ఎంతవరకు సమంజసం. అధికమైన నైరుతి పల్లం (deep depression) అనేది ఎంత భయానకమైన ఫలితములు ఇస్తుందో ఈ సంఘటన మనకు తెలియజేస్తున్నది. 

దీనిని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. వాస్తు శాస్త్రంలో గృహము లోపల మరియు బయట భాగములు ఫలితములను ఇచ్చు విషయంలో ప్రభావంతంగా ఉంటాయని గమనించాలి. పరిశోధనలు చేసినప్పుడు మాత్రమే ప్రతి ఒక్క విషయము నిధానముగానైనను వెలుగులోకి వస్తాయి. భవిష్యత్తులో ఈ వాస్తు శాస్త్రంపై అద్భుతమైన పరిశోధనలు జరిగి తప్పకుండా మానవులకు ఎంతగానో సహాయ సహకారములు అందించగలదు. వాస్తు శాస్త్రవేత్తల నిరంతర పరిశోధనల ఫలితాలు భవిష్యత్తులో ప్రజలకు తప్పక అందుతాయి. భారత దేశం లోని ఎంతో మంది వాస్తు శాస్త్రవేత్తలు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తమ పరిశోధనలను ఎవరి సహాయ సహకారం లభించక పోయినా, నిరంతరం కొత్త విషయాల కోసం అన్వేషణ చేస్తూ అందరి హృదయాలలో సజీవంగా నిలిచిపోతున్నారు. వీరు ధన్యులు. 

ఇదే వాస్తు శాస్త్రం విదేశీ గడ్డపై జన్మించి ఉండి ఉంటే నేడు జనం వేలం వెర్రిగా ఈ శాస్త్రంను సైన్స్ రూపకంగా తీసుకొని విమర్శలు లేకుండా తమ గృహమునకు శ్రద్ధగా పాటించేవారు, అయితే ఇంత మహా శక్తి కలిగిన వాస్తు శాస్త్రం భారతదేశ గడ్డపై జన్మించడం మనం చేసుకున్న అపురూపమైన విశేషమైన అదృష్టం అని చెప్పవచ్చు. ఎంతో మంది ఎగతాళి చేసేవారున్ననూ, ఎన్నో కొత్త కొత్త విమర్శలు ఉత్పన్నమైతున్నా కూడా ఈ శాస్త్రము స్వల్పంగా కూడా మసక బారక తన ప్రాభవమును ఏమాత్రం కోల్పోక, బహుళ రీతిలో జన రంజకమై ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అంతేకాకుండా నేడు అధిక శాతం భారతీయులు ఎంతో మక్కువ చూపడం అనేది హర్షించదగ్గ విషయం. అదే ఈ శాస్త్రంలో/ మన భారతీయత లో ఉండే గొప్పతనం. భారత మాతకు జయము జయము. సమస్త భారతీయులకు జయము జయము.

గృహం యొక్క గచ్చు , భూమి నుంచి ఎంత ఎత్తులో నిర్మాణం కావించాలి?

15. మనం కట్ట బోయే గృహం రహదారి కన్నా దాదాపుగా 6 అడుగుల ఎత్తు ఉంటే మంచిది. ఆరు అడుగులు కుదరకపోతే, కనీసం 4 అడుగుల ఎత్తు అయినా ఉంచుకోవడం మంచిది. ఒక్క విషయం నిజమే, ఒక్క అడుగు పెరిగినా ఖర్చు  పెరుగుతుంది. అయితే, భవిష్యత్తులో వచ్చే మంచి ఫలితాలను దృష్టిలో ఉంచుకుంటే, ఈ ఖర్చుకు సిద్ధపడటం మేలనిపిస్తుంది. గృహం యొక్క గచ్చు భాగమును సాధారణంగా ఆంగ్ల భాషలో “ఫ్లోర్ లెవెల్” అని అంటారు. ఈ గచ్చు భాగం భూమి నుంచి ఎంత ఎత్తులో నిర్మాణము చేయాలి అనేది ఒక ముఖ్యమైన విషయము. 

ఇంటి నెల ఎంత ఎత్తులో ఉండాలి

ఎంతోమంది గృహస్తులు ఈ విషయం గా పదేపదే విచారించడం అనేది సాధారణమైన విషయం. నేల నుంచి గృహం ఒక అడుగు లేదా రెండు అడుగులు ఎత్తులో నిర్మాణం కాపించేటట్లయితే దీనికంటూ ఒక ఖర్చు అనేది వస్తుంది. మనం బయట ఎన్నో గృహాలను గమనిస్తూ ఉన్నట్లయితే కొన్ని గృహాలు నేల నుంచి ఒక అడుగు ఎత్తులో నిర్మాణం కావిస్తారు కొందరు రెండు అడుగుల ఎత్తులో నిర్మాణం కావిస్తారు ఇంకొందరు మూడు అడుగుల ఎత్తులో నిర్మాణం కావిస్తారు ఇవన్నీ సాధారణంగా మనం సమాజంలో చూస్తూ ఉంటాము.

అయితే కొన్ని పుస్తకాలలో ఈ విషయంపై కొన్ని ప్రామాణికములను తెలియజేశారు. నేల నుంచి గృహమును ఆరు అడుగుల ఎత్తులో నిర్మాణం కావించినట్లయితే ఆ నేల లోపల ఏవైనా ఎముకలు గాని లేదా వెంట్రుకలు కానీ లేదా చెడుపు చేసిన విషయంగా కానీ ఏమైనా ఉన్నట్లయితే ఆరడుగుల పై భాగమునకు దాని చెడు ప్రభావం రాదని, కావున గృహస్తులు నేల నుండి ఆరడుగుల పై మేరకు గృహ నిర్మాణమును వచ్చు లాగున చేయవలెనని తెలియజేశారు.

గృహానికి వాస్తరీత్యా ప్రత్యేకమైన రంగులంటూ ఏమైనా ఉన్నాయా?

16. ఎప్పటికైనా పదిమంది మెచ్చే రంగులను మన గృహమునకు కూడా వేసుకోవటం ఉత్తమము, అలా కాదని విచిత్రమైన రంగులు వేసుకున్నట్లయితే బహుశా అది ఎబెట్టుగా కనిపించవచ్చు. సర్వజన సమ్మతం అంటూ మనం పాటించడం అన్ని విధాల మంచిది, అలా కాకుండా విభిన్నమైన / అసహ్యమైన రంగులు వేసుకున్నప్పుడు చూడటానికి ఏ మాత్రం బాగుండకపోవచ్చు. ప్రస్తుత కాలానికి కొన్ని స్టైల్స్ అంటూ రావడం మనం ఎన్నో సంవత్సరాలుగా గమనిస్తూనే ఉన్నాము, అలా వచ్చినవి, ఇలా పోతూ ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన గృహములకు సర్వజనము మెచ్చిన రంగులు వేసుకోవటం చాలా బాగుంటుంది. 

వాస్తు శాస్త్ర రీత్యా గృహానికి ఏ రంగు వేయాలి?

శ్మశానం పక్కన గృహ నిర్మాణం చేయవచ్చునా?

17. దయచేసి స్మశానం పక్కన గృహములు నిర్మించుకోవద్దు ఇది మంచి పద్ధతి కాదు. స్మశానం అనగా, మానవులు నివసించే స్థలం కాదు, అంతేకాకుండా, ప్రతికూల వాతావరణము, లేదా అఖానార్ధకమైన స్థలము అని చెప్పవచ్చు. ఇటువంటి ప్రదేశముల ప్రక్కనే గృహ నిర్మాణం కావించడం సరైన విధానం కాదు. సమాధులు ఉన్న ప్రాంతమునకు కూడా “దూరంగా” గృహ నిర్మాణం చేసుకోవడం మంచిది, ఒకవేళ మీరు ఇటువంటి స్థలము ప్రక్కన గృహం నిర్మించ వలసిన పరిస్థితులు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఒక వాస్తు సిద్ధాంతిని సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోవడం ఉత్తమమైన విధానం.

శ్మశానం పక్కన ఇంటి నిర్మాణం

వివిధ ప్రదేశాలలో శ్మశానాన్ని శ్మశాన వాటిక, వల్లకాడు, కాడు, కాష్టం వంటి వివిధ పదజాలంతో పిలుస్తారు. ఈ స్థలాల్లో మరణించిన వ్యక్తులకు దహన సంస్కారాలు నిర్వహించబడుతాయి. ప్రతి గ్రామానికి ఒకటి గాని, దానికి మించి గాని శ్మశానాలు ఉండటం సాధారణం. మరణించిన వారికి నివాళిగా కొందరు సమాధులు నిర్మించే పద్ధతి సంప్రదాయంగా ఉంది. దయచేసి అనుభవం లేని వారితో స్థల పరిశీలన కావించవద్దు దానివల్ల మంచి జరగకపోగా చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మీరు తీసుకునే ఒక్క నిర్ణయం భవిష్యత్తులో మీ తరువాత తరాల వారికి ఉపయోగిస్తుంది, తొందరపాటు నిర్ణయాలు ఏ రీతిలో కూడా మంచిది కాదు. సొంత నిర్ణయాలు పనికి రాకపోవచ్చు లేదా మీరు నిర్మించబోయే స్థలమును సవివరంగా వాస్తు సిద్ధాంతులకు వివరించలేకపోవచ్చు, కావున ఇటువంటి పరిస్థితులలో ప్రతి గృహస్తులు అనుభవజ్ఞులైన వాస్తు సిద్ధాంతుల ద్వారా తగిన సలహాలను పొందగలరు, దయచేసి వారికి మీరు కొనబోయే స్థలమును చూపించవలసిందిగా అభ్యర్థిస్తున్నాము, ఫోన్ ద్వారా నిర్ణయాలు పొందవద్ధు.

జనాభా పెరగడం వలన రాను రాను స్థలములు తగ్గిపోతున్నాయి. ఈ నిష్పత్తిలో, ఉన్న స్థలంలోనే గృహం నిర్మించుకుందాం అనుకుంటే స్థలం సరిపోవడం లేదు, కాస్త స్థలం పెరగాలి, లేదా కొత్త స్థలంలో గృహ నిర్మాణం కావించాలి. పెరిగిన జనాభా అంతటికి గృహములు కావాలి కదా, ఈ పరిస్థితులలో ఎక్కడ స్థలములు దొరికితే అక్కడ గృహాలు నిర్మించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం కదా. భవిష్యత్తులో ఈ జనాభా అంతటికి గృహాలు నిర్మించుకోవడానికి స్థలం సరిపోకపోవచ్చు, అటువంటి పరిస్థితులలో ఏ ప్రదేశంలో నైనా నిర్మాణాలు కావించడానికి సిద్ధపడతారు. అది స్మశానమే కానీయండి లేదా ఇంకొక పనికిరాని స్థలమే కానీయండి లేదా చెరువులు కానీయండి లేదా సరస్సులు కానీయండి ఎక్కడైనా సరే గృహ నిర్మాణం కావించడానికి సిద్ధపడుతున్నారు. ఇలాగే పోతుంటే భవిష్యత్తులో స్థలములు దొరకక జరగారానటువంటి దారుణాలు ఎన్నైనా జరగవచ్చు. జనాభా కట్టడి కావలసిందే, లేకపోతే మానవజాతి భవిష్యత్తులో దారుణాలను చూడక తప్పదు.

-: దాత వివరములు : –

ఎంతోమంది గృహస్థులకు తమకు జన్మనిచ్చి, ఉన్నతంగా తీర్చిదిద్దిన తమ తల్లిదండ్రుల పేర్లను లేదా తమ పెద్దల పేర్లను చిరస్థాయిగా ఈ సమాజంలో నిలిచిపోయెందుకు భారీ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది చాలా మంచి పరిణామము, మరియు వీరి ఆలోచన అద్భుతం, అపూర్వ సృజనాత్మకత. ఒక వేళ మీకంటూ ఇటువంటి ఆలోచన ఉన్నట్లయితే మీ లోకల్ లాంగ్వేజ్ లో వెబ్సైట్ తయారవుతున్నది.  మీరు మీ పెద్దల పేర్లను చిరస్థాయిగా ఈ సమాజంలో నిలిపి ఉంచడానికి, వారి పేర్లు, పేర్లతో పాటుగా చిత్రపటములను కూడా ముద్రిస్తాము. ఈ వెబ్సైటు ఉన్నంతకాలం మీ పేరు, లేదా మీ తల్లితండ్రుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. మొత్తం వెబ్ సైట్ అంతయు మీరు స్పాన్సర్ చేయవచ్చు.  లేదా ఒక ప్రత్యేకమైన పేజీ ను స్పాన్సర్ చేయవచ్చు. సింగల్ టైం పేమెంట్ మాత్రమే. ప్రతి సంవత్సరం కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు స్పాన్సర్ చేయాలని అనిపిస్తే ఈ క్రింద లింకు ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు, తదుపరి మిగిలిన సమాచారంను అందజేయగలము. https://www.subhavaastu.com/contact-us.html

-: SPONSORSHIP : –

Many residents are committed to honoring the names of their parents, grandparents, or elders, with the aim of keeping their legacy vibrant in their respective societies. This admirable effort is truly heartening. If you feel a connection to this endeavor, our website, thoughtfully crafted in your native language, offers a supportive platform while deeply respecting your sentiments. We are dedicated to helping you ensure that the names of your loved ones are remembered with respect and fondness. You have the option to sponsor either the entire website or a specific page, all with a single payment, freeing you from the concern of annual fees. In doing so, the names of those dear to you will be cherished and celebrated for as long as our website continues to exist. If you’re interested in this meaningful tribute, please contact us for more information. Contact Us : https://www.subhavaastu.com/contact-us.html

- : ప్రత్యేక ధన్యవాదములు : - పి కోటేశ్వర రావు - హైదరాబాద్