తెలుగులో ఈశాన్య
దిశ గృహ వాస్తు వివరణ & ఫలితాలు
దిశాత్మక దిక్సూచి (Directional Compass ) రీత్యా ఈశాన్యం దిక్కు 45° లకు ఉంటుంది. ఈ దిక్కు ఉత్తరం మరియూ తూర్పు దిశల మధ్యలో, కోణంలో ఉంటుంది. దీనినే ఈశాన్య మూల లేదా ఈశాన్య కోణం అని అంటారు. అన్ని దిక్కులలోనూ ఈ దిశ సున్నితత్వం కలిగినది మరియూ అత్యంత ప్రభావమంతమైనది. ఈశాన్య దిశ యొక్క ప్రభావములు గృహము యొక్క శాంతి పై ప్రభావం చూపును. ఈశాన్యం బాగా ఉంటే, గృహములో శాంతం ఉంటుంది. ఈశాన్య దిశలో దోషములు వున్నట్లైతే గృహములో అశాంతి ఉండవచ్చును.

If you are familiar with the English language, we have created a detailed guide on Northeast house Vastu. If you have a few minutes, you can explore the link: Comprehensive details of Northeast Facing House Vastu in English.
దయచేసి మీరు మీ లాప్టాప్ (Laptop) నందు మాత్రమే ఈ లింకులో ప్రచురితమైన విషయాలను చదవండి, మొబైల్ ఫోన్ (Mobile phone) లో చదవడం వల్ల అంత బాగా కనిపించదు, మరియు అచ్చు తప్పులు కనిపించే అవకాశం అధికంగా ఉంటుంది. అదే మీ లాప్టాప్ లో చదివినట్లయితే ఏ సమస్యలు లేకుండా చూడడానికి చాలా బాగా ఉంటుంది, మరియు ఏ అచ్చు తప్పులు కూడా కనిపించవు. చదవడానికి కుతూహలంగా, ఉత్సాహంగా ఉంటుంది.
విజ్ఞప్తి : – ఇక్కడ ప్రచురించిన విషయాలు కొన్ని నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భములు లేదా భిన్న పరిస్థితులలో, ఫలితములు అనూహ్య మార్పులకు లోనయ్యే అవకాశముంది. వాస్తు శాస్త్రం ఒక సంక్లిష్టమైన శాస్త్రం, అనేక సూత్రాలతో, దృఢమైన నిబంధనలతో ముడిపడి ఉన్నది. వాస్తవం ఏమిటంటే, వాస్తు గ్రంథాలు, దృశ్యశ్రవణం (వీడియోలు) ఆధారంగా మార్పులు చేసుకొని ప్రయోజనం పొందిన వారికన్నా, అపాయకరమైన ఫలితాలను అనుభవించినవారే అధికంగా ఉన్నారు. స్వీయ నిర్ణయములను తీసుకోవద్దు. అనుభవజ్ఞులైన వాస్తు నిపుణుల సలహా తీసుకున్న తరువాత మాత్రమే నిర్ణయములు తీసుకోవలసినది. ఇక్కడ ఉద్దేశించేది కేవలం “వాస్తు విషయాలపై పరిజ్ఞానాన్ని” పెంపొందించడమే గానీ, అనుసరించమని సూచన కాదు. “ద య చే సి” ఈ విషయాన్ని గమనించగలరు.
ఈశాన్య మూల గృహాలను మనం ఎలా కనుక్కోవాలి?

ఈశాన్య దిశ గృహం తీసుకుంటే జీవితం బాగుంటుందా?
నైరుతి మూల, ఆగ్నేయ మూల వాయవ్య మూల చూస్తూ కట్టిన గృహాలతో పోలిస్తే ఈశాన్య మూల ను చూస్తూ నిర్మించిన గృహం మంచి ఫలితాలను ఇవ్వవచ్చును. ఈశాన్య దిశ గృహము (Northeast facing house) వేరు, ఈశాన్య మూల (Northeast corner house) గృహము వేరు. చాలా మంది, రెండూ ఒక్కటే అనుకొని పొరపాట్లు చేస్తుంటారు. ఈశాన్య దిశ (ఈశాన్య దిక్కుకు తిరిగిన) గృహము తీసుకునే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పొరపాటు కూడా ఒక్కోసారి విపరీతమైన ఇబ్బందులకు గురిచేస్తుంది. దిశలలో ఉన్న గృహాలకు (అనగా తూర్పు దిశ గృహం, పశ్చిమ దిశ గృహం, ఉత్తర దిశ గృహం, దక్షిణ దిశ గృహాలు) కోణంలో వచ్చిన గృహాలకు (అనగా ఈశాన్య మూల గృహం, ఆగ్నేయ మూల గృహం, నైరుతి మూల గృహం, వాయవ్య మూల గృహాలు) ఎంతో వ్యత్యాసమున్నది. కోణం వేరు, చూపు వేరు. రెండు దిక్కులు కలిస్తే కోణం అవుతుంది. కోణం లలో నిర్మితమైన గృహాలకు, మూలలు చూస్తూ నిర్మితమైన గృహాలకు చాలా వ్యత్యాసం ఉన్నది.
ఈశాన్య దిక్కుకు తిరిగిన గృహాలను మనం ఎలా కనుక్కోవాలి?
ఉత్తర దిశ సున్నా డిగ్రీలు లేదా 360 డిగ్రీలకు ఉంటుంది (0° లేదా 360°). తూర్పు దిశ 90 డిగ్రీలకు (90°) ఉంటుంది. ఈ రెండిటికీ మధ్య 45 డిగ్రీలకు (45°) ఈశాన్యం ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నది ఈశాన్యం దిక్కుగా ఉన్న గృహము. ఈ చిత్రపటంలో ఒక గృహము ఈశాన్యం దిక్కుకు తిరిగి ఉన్నది. ఈ గృహము ముందర ఉన్న రహదారిని ఈశాన్య రహదారి అని అంటారు. అనగా ఈ గృహమునకు ఈ రహదారి ఈశాన్య రహదారి అవుతుంది. ఈశాన్యం మూలలో కట్టిన గృహము (Northeast corner House) వేరు, ఈశాన్యం దిక్కుకు తిరిగి ఉన్న గృహము (Northeast facing house) వేరు, ముందుగా ఈ విషయాన్ని మనము శ్రద్ధగా తెలుసుకోవాలి. ఈశాన్యము మూలలో కట్టిన గృహము సాధారణంగా ఊహించిన ఫలితాలను ఇవ్వవచ్చును. అదే ఈశాన్యము తిరిగిన గృహము అద్భుతమైన ఫలితాలను లేదా ఊహించిన ఫలితాలను ఇస్తుంది అని చెప్పలేము. ఈ విషయం తెలియక ఈశాన్య దిక్కుకు తిరిగిన గృహము అని, అధిక ధరలు పెట్టి గృహాలనుకొంటుంటారు. చివరికి ఇబ్బందులకు గురి అయ్యి, ఆనక వాస్తు శాస్త్రవేత్తల దగ్గరకు వస్తుంటారు. ఈశాన్యం దిక్కుకు నిర్మితమైన గృహాల విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ చిన్న పొరపాటైననూ అనేక విధాలైనటువంటి సమస్యలను సృష్టిస్తుంది.

ఇటువంటి ఈశాన్యముకు తిరిగిన గృహాలు లేదా స్థలాలు దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉండవచ్చు, లేదా ఉత్తర భారత దేశంలో అధికంగా ఉండవచ్చు, అయితే విదేశాలలో ఇటువంటి స్థలాలు లేదా గృహాలు కోకొల్లలు. లెక్కపెట్టలేనంతగా ఇటువంటి గృహాలు ఆ దేశాలలో నిర్మితమై ఉంటాయి. ఉదాహరణకు అమెరికా దేశంలో అయితే, ఈశాన్యము దిక్కుకు తిరిగిన గృహాలు దాదాపుగా లక్షల్లో ఉంటాయి. మన భారతీయులు కూడా అమెరికాలో లక్షల్లో ఉన్నారు కదా, ఈశాన్యము అనగానే వెనకా ముందూ ఆలోచన చేయకుండా అధిక ధరలు వెచ్చించి గృహాలను కొనేస్తుంటారు. ఇక్కడ గృహాలను కట్టే లేదా అమ్మే కంపెనీలు, భారతీయుల ఆలోచనను దృష్టిలో పెట్టుకొని, అత్యంత అధిక ధరలకు ఈ ఈశాన్యము స్థలాలను లేదా గృహాలను అమ్ముకుంటుంటారు.
ఈశాన్య మూల ఎక్కడ ఉంటుందో చిత్రపటం ద్వారా చూపించండి
ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే రీతిలో ఈశాన్య మూల ఎక్కడ ఉందో తెలుపుతూ తయారుచేసిన ఈ చిత్రపటంలో ఉత్తరం అని తెలిపిన ప్రదేశము నుంచి ఒక గీత, మరియు తూర్పు అని తెలిపిన ప్రదేశం నుంచి ఒక గీత, రెండూ ప్రయాణం అవుతూ ఒక మూలభాగంలో కలుస్తాయి. ఈ మూలభాగమునే ఈశాన్యం మూల అని అంటారు. వాస్తు శాస్త్రంలో ఈశాన్య మూలకు లేదా ఈశాన్య భాగమునకు ఒక ప్రశస్తమైన, ప్రభావవంతమైన, విశిష్టమైన, అద్భుతమైన స్థానం ఉన్నది. ఈశాన్యం చెడితే సమస్తము చేసినట్లే అని పెద్దలు చెబుతూ ఉంటారు. గృహస్థుల యొక్క అభివృద్ధికి గృహస్తుల యొక్క ప్రశాంతతకు ఈశాన్య భాగము ఒక కీలక ఘట్టమును పోషిస్తుంది. దానిని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు గీతలు కలిసిన ప్రదేశం లో నక్షత్ర ఆకారంలో కొన్ని ప్రత్యక్షమవుతూ ఉంటాయి, అనగా ఈ ప్రాంతము చాలా ప్రత్యేకమైనది మరియు చాలా ముఖ్యమైనది అని తెలుపుట కొరకు ఈ ఏర్పాటు చేయడం జరిగినది.

ప్రతి ఈశాన్య దిక్కు గృహం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందా? ఒక ఉదాహరణ . . .
1. మీరు నమ్మాల్సిన అవసరం లేదు, అయితే ఒక విషయం మీకు తెలియడంవలన ప్రయోజనం ఉండవచ్చునేమోనని ఇక్కడ తెలపడం జరిగినది. మధు అనే వ్యక్తి , ఉత్తర అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం లో గృహాన్ని కొనాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో ఒక వాస్తు శాస్త్రవేత్తని సంప్రదించి రెండు గృహాలకు వాస్తు చూపించుకున్నారు. వాస్తు చూపించుకోవడానికి పదేపదే డబ్బు కట్టాలంటే అతనికి మనసు ఒప్పలేదు, ఈ క్రమంలో ఒక బిల్డర్ కొత్తగా వేస్తున్న వెంచర్లో ఈశాన్యం దిక్కుకు తిరిగిన స్థలమని, ఒక లక్షా 19 వేల డాలర్లు అధిక ధనం చెల్లించి స్థలాన్ని (గృహాన్ని) సొంతం చేసుకున్నాడు. ఇది జరిగినది ఫిబ్రవరి నెల, 2018 వ సంవత్సరం. అదే 2018 వ సంవత్సరం నవంబర్ నెలలో ఇతనికి నూతన గృహాన్ని అప్పగించారు. మాకు తెలిసినంతలో ఇది అప్పట్లో ఒక రికార్డు. ఇక్కడ జరిగిన విషయాన్ని ఈ కింద పేరాలలో తెలుపుతున్నాము, మీకు సమయం ఉంటే, దయచేసి మొత్తం చదవండి, ఈ గృహస్థులు చేసిన పొరపాటు అర్థం అవుతుంది.

2. అది 2020 వ సంవత్సరము సెప్టెంబర్ నెల. మధు గారు ఈ గృహాన్ని అమ్ముకొని వేరే గృహానికి వెళ్లాలని బలమైన ప్రయత్నం చేసాడు, విషయం ఏమిటంటే, ఫలితాలు ఏమాత్రం మంచిగా రాకుండా, చెడు ఫలితాలు అధికంగా వస్తున్నాయి, ఎప్పుడు చూసినా ఏదో ఒక నస, ఒకటి పోతే ఒకటి సమస్యలు. ఇంట్లో ఎప్పుడూ వాదులాటలు, 2020 సంవత్సరం జులై నెలలో ఇతని శ్రీమతికి ఉద్యోగం పోయింది. ఒకరి జీతం మీద జీవన పోరాటం చెయ్యాలంటే ఎంత ఇబ్బందో అమెరికాలో ఉన్న వారికి బాగా తెలుసు. భార్యాభర్తలు ఇరువురు కూడా పని చేస్తుంటే ఒకరి జీతం గృహానికి ఉన్న బ్యాంకు కంతు కట్టుకోవడం, ఇతరత్రా ఖర్చులకు పోను, మిగిలిన వారి జీతము అట్టిపెట్టుకోవచ్చు. ఇది సర్వసాధారణంగా అమెరికాలో జరుగుతున్న తంతు. ఎప్పుడైతే తన భార్యకు ఉద్యోగం పోయిందో, అప్పుడు అతనికి వాస్తవం బోధపడింది. తను ఏదో పొరపాటు చేశాడని అప్పుడు గ్రహించాడు. ఇంకేముంది వెంటనే తన గృహానికి వాస్తు చూపించుకున్నాడు. ఆ గృహము ఈశాన్యం దిక్కుకు తిరిగినది, అయితే మంచి ఫలితాలు ఇచ్చే గృహం కాదు.
3. ఇది ఈశాన్యం దిక్కుకు తిరిగిన గృహమని తలచి వెనుకా ముందూ ఆలోచన చేయకుండా లక్ష ఇరవై వేల డాలర్లు “అధికధర” చెల్లించి గృహాన్ని కొన్నాడు, ఇంత అధిక ధర చెల్లించిన గృహస్థునికి, ఒక వాస్తు వ్యక్తికి ఇచ్చే సొమ్ము కోసం ఆలోచన చేశాడంటే ఏమనాలి !!! తెల్లవాళ్లు (local Americans) ఎంతైనా తినవచ్చు, మన భారతీయులు మాత్రం సంపాదన చేసుకోకూడదు అనే ఆలోచన అతనిలో బలంగా కనిపించింది. పీకల మీదికి వచ్చిన తర్వాత వాస్తు కోసం, ఇంటి లోపల చేయాల్సిన మరమ్మత్తుల కోసం ఎంత సొమ్ము అయిననూ వెనకాడక ముందుకు వచ్చేసాడు. తను చేసిన పొరపాటు ఏమిటో చేతులు కాలిన తర్వాత అర్థమైంది.
కొన్ని గృహాలకు వాస్తు గురించి చెప్పే సమయంలో ఇది ఇలా ఉంటే మంచిది అలా ఉంటే చెడ్డది అని చెప్పుకోవచ్చు అయితే మూలలకు తిరిగిన గృహాల గురించి చెప్పాలంటే అంత సులభం కాదు, ఎందుకనగా సంపూర్ణంగా చెప్పాలంటే పుస్తకమే వ్రాయాలి, సంక్షిప్తంగా చెబితే చదివే వారికి అర్థం కాదు. ప్రతి విషయంలోనూ కొన్ని పరిమితులు ఉంటాయి కదా. ఈ లింక్ లోని విషయాలను చదవడానికే కొందరు నొసలు చిట్లిస్తారు, ఒక పుస్తకాన్ని చదవాలంటే చదవగలరా?.
ఇదే ఇంకొక ఈశాన్య గృహం అద్భుతమైన ఫలితాలను ఎలా ఇచ్చింది?
దయచేసి ఒక్కసారి ఇదే గృహాన్ని పై భాగంలో చూపించడం జరిగింది ఒక్కసారి ఆ చిత్రపటం గమనించండి మరొకసారి ఈ చిత్రపటాన్ని గమనించండి. ఏ మార్పులు జరిగాయో గమనించాలంటే కొంచెం కష్టం. అయితే జాగ్రత్తగా చూసినట్లయితే ఏ మార్పు జరిగిందో తెలుస్తుంది. అమెరికా దేశంలో ఫ్లిప్ మోడల్, స్విచ్ మోడల్, మిర్రర్ ఇమేజ్, అనే పదాలు సర్వసాధారణం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గృహం మధు గారి గృహం తర్వాత నాలుగో ఇల్లు. పేరు శివ. మధు గారు మరియు శివ గారి కుటుంబీకులు మామూలుగా కలవడం జరుగుతుంది, ఇరువురి పిల్లలు బాగా సాన్నిహిత్యం పెంచుకొని ఒకరంటే ఒకరు విడవలేని స్థితికి వచ్చారు. శివ గారు తన గృహం లో బ్రహ్మాండమైన సంతోషాన్ని చూస్తున్నారు, జీవితం బాగా కులాసాగా గడిచిపోతున్నది. మరి మధు గారి గృహానికి ఏమైంది?, ఇంతకీ దోషం ఎక్కడుంది. అసలు కిటుకు అర్థం కావాలంటే కష్టం, అయితే మీరు రెండు చిత్రపటాలను పదే పదే, పదేపదే, చూస్తే మీకు అర్థమవుతుంది ఒక చిన్న పొరపాటు జీవితాన్ని అతలాకుతలం చేసింది.

ప్రతి ఒక్క ఈశాన్య గృహం కూడా బ్రహ్మాండమైన ఫలితాలు / ఊహించిన ఫలితాలు వస్తాయి అని అనుకోకూడదు. ముందుగా ఈశాన్య గృహం కొనాలంటే ఎన్ని డిగ్రీలకు ఉన్నదో చూసుకోవాలి. 45 డిగ్రీలు దాటిన తర్వాత, గృహం తూర్పు ఈశాన్యం పక్కగా తిరుగుతున్నది అని తెలుసుకోవాలి. 45 డిగ్రీల లోపల ఉన్నట్లయితే, గృహం ఉత్తర ఈశాన్యం వైపుగా ఉన్నట్టుగా తెలుసుకోవాలి. 45 డిగ్రీలయితే అది ఖచ్చితమైన ఈశాన్యంగా తెలుసుకోవాలి. ఒకవేళ గృహం రమారమి 65 డిగ్రీల దాకా ఉంటే అప్పుడు బెడ్ రూమ్ ఎక్కడ ఉన్నదో చాలా జాగ్రత్తగా గమనించాలి. మధు గారి గృహం యొక్క బెడ్ రూమ్ దాదాపుగా వాయవ్య భాగమునకు వెళ్ళినది. అదే శివ గారి బెడ్ రూమ్ దాదాపుగా దక్షిణ నైరుతి / నైరుతి ప్రాంతంలో ఉన్నది. అంతేకాకుండా ముఖ ద్వారము, గారేజ్, వాస్తు ఫలితాల విషయం లో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఇతర విషయాలను గమనించి మాత్రమే మనం ఒక గృహాన్ని కొనాలా వద్దా అనే నిర్ణయానికి రావాలి, అంతేకానీ ఒక గృహం ఈశాన్యం తిరిగింది కదా అని తొందరపాటు పడి గృహం తీసుకున్నట్లయితే భవిష్యత్తులో వచ్చే మంచి లేదా చెడు ఫలితాలను గృహస్థులు మాత్రమే అనుభవించాలి.
వెడల్పుగా నిర్మించిన ఈశాన్య ముఖ గృహం

పొడవుగా నిర్మించిన ఈశాన్య ముఖ గృహం
ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రంలోని ఈశాన్య దిక్కుకు నిర్మితమైన ఈ గృహంలో ఊహించిన ఫలితాలను పొందే అవకాశం అధికంగా ఉన్నది. ఈశాన్య దిక్కుకు నిర్మితమైన గృహాన్ని కొంటే చాలా మంచిదని తలచే వారికి ఇటువంటి గృహము మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం అధికము. సాధారణంగా ఇటువంటి గృహాలు చెడు ఫలితాలను ఇవ్వవు. అయితే ఒక్క విషయం గమనించండి, ఇటువంటి గృహము లోపల మాస్టర్ బెడ్ రూమ్ లో వాయవ్య ఆగ్నేయ కొలతలు అధికంగా ఉండకూడదు, అంతేకాకుండా ఫ్యామిలీ రూమ్ కూడా ఆగ్నేయ వాయవ్య కొలతలు అధికంగా ఉండకూడదు. ఒకవేళ ఇటువంటి కొలతలు కలిగిన మాస్టర్ బెడ్ రూమ్ మరియు ఫ్యామిలీ రూమ్ ఉన్నప్పుడు, గృహస్తులు ఊహించిన మంచి ఫలితాలు రావడం కష్టమే. ఒకవేళ మీరు తీసుకునే గృహానికి మాస్టర్ బెడ్ రూమ్ మరియు ఫ్యామిలీ రూము, ఈశాన్యం నైరుతి కొలతల కన్నా, వాయవ్య ఆగ్నేయ కొలతలు అధికంగా ఉన్నట్లయితే, దయచేసి బాగా అనుభవం ఉన్న ఒక వాస్తు శాస్త్రవేత్త ద్వారా మాత్రమే తగిన నిర్ణయాన్ని తీసుకోండి, తొందరపాటు నిర్ణయాల వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

ప్రస్తుతానికి అమెరికాలోని చాలా రాష్ట్రాల నందు గృహాల ధరలు ఎంత చిన్నవి తీసుకున్నా 5 లక్షల డాలర్ల పై మాటే ఉంటున్నాయి, అధిక శాతం 1.2 లేదా 1.5 మిలియన్ డాలర్స్ గా ఉంటున్నాయి. ఇంత ధనం పోసేముందు వాస్తు కన్సల్టెన్సీ కి అతి చిన్న మొత్తాన్ని కేటాయించడం వల్ల భవిష్యత్తులో మనకు లాభమే కానీ నష్టం కాదు కదా. బాగా ఆలోచన చేసుకుని మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఒకవేళ మీరు వాస్తు శాస్త్రంలో మహా నిష్ణాతులయితే ఇటువంటి గృహాలను కొనవచ్చు.
అర్ధ చంద్రాకారంలో ఈశాన్యం కోల్పోయిన ఈశాన్యం మూల గృహము
ప్రస్తుతం మీరు చూస్తున్నది, ఈశాన్యం మూల గృహము. ఈ గృహములకు కూడా ఉత్తరం రోడ్డు మరియు తూర్పు రోడ్డు కలవు. అయితే ఈ రెండు రహదారులు కోణంగా కలవక, అర్థ చంద్రాకారంలో కలుస్తూ స్థలానికి ఈశాన్యంలో కోత పెడుతున్నాయి. ఈ విషయంగా ఎంతోమంది వాస్తు శాస్త్రవేత్తలు అనేక రకాలైనటువంటి తమ అభిప్రాయాలను తెలుపుతూ వచ్చారు. ఎప్పటికైనా లాజిక్ అనేది అతి ముఖ్యము, ప్రాముఖ్యము. అత్యంత ముఖ్యమైన విషయము తెలియజేస్తున్నాము జాగ్రత్తగా చదవండి. ఇటువంటి స్థలములలో గ్రహములు నిర్మించుకున్నప్పుడు ప్రహరీ గోడ ( దయచేసి మరొకసారి చదువుకోండి ) ఉన్నప్పుడు ఫలితాలు ఒక విధంగా, ప్రహరీ గోడ లేనప్పుడు ఇంకొ విధంగా ఫలితాలు ఉంటాయి. సాధారణంగా విదేశాలలో ముఖ్యంగా అమెరికా లాంటి దేశంలో ఇటువంటి గృహాలకు పూర్తి ప్రహరీ గోడ ఉండదు. అనగా 4 దిక్కులలో ప్రహరీ గోడ ఉండదు. ఇటువంటి పరిస్థితులలో చెడు ఫలితాలు రావడం చాలా అరుదు, ఒకవేళ ఇంటిలో ఏదైనా బలమైన వాస్తు దోషమున్నప్పుడు చెడు ఫలితాలు వస్తాయి, అంతేకానీ ఈశాన్య భాగంలో అర్ధచంద్రాకారంలో ఈశాన్యం కోతపడినదని భావించి కొందరు ఇటువంటి గృహాలను కొనాలా వద్దా అనే నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

ఒకవేళ మీరు అమెరికాలో ఉన్నట్లయితే, ఇటువంటి స్థలాలకు ప్రహరీ లేనప్పుడు, ఇంటి లోపల అత్యంత బలమైన వ్యతిరేక వాస్తు నిర్మాణం లేనప్పుడు, ఇటువంటి స్థలములు లేదా గృహములను కొనవచ్చును. ఒకవేళ మీరు ఇతర దేశాలలో లేదా భారతదేశంలో ఉండి ఇటువంటి గృహాలకు ప్రహరీ ఉన్నప్పుడు మీరు కొనక పోవడమే మంచిది. ఒకవేళ కొనాల్సిన పరిస్థితి ఏర్పడితే తప్పకుండా ఒక మంచి వాస్తు శాస్త్రవేత్త ద్వారా గృహాన్ని మొత్తం పరిశీలింప చేయించుకుని తర్వాత నిర్ణయం తీసుకోగలరు. అనుభవం గడించిన వాస్తు శాస్త్రవేత్త ఇటువంటి ఆస్తిని గమనించిన పిదప తప్పకుండా కొన్ని ఉపాయములు చెప్పగలరు.
తూర్పు - ఉత్తర రహదారుల కోణంలో ఉన్న ఈశాన్య ఇల్లు – వాస్తు విశేషాలు

వాయవ్య ఆగ్నేయం పెరిగిన ఈశాన్య మూల గృహం
ఎంతోమంది ఈశాన్యం గృహం అనగానే వెనుకా ముందూ చూడకుండా మంచి – చెడూ విచారించకుండా వెంటనే వెళ్లి స్థలానికి / గృహానికి అడ్వాన్స్ పేమెంట్ కట్టి ఆనక తీరిగ్గా విచారిస్తూవుంటారు. ఒక్కసారి చిన్న పొరపాటు చేస్తే అది దాదాపుగా రెండు తరాలను ముప్పు తిప్పులు పెట్టవచ్చు. ఈ స్థలము లేదా గృహం కూడా ఈశాన్య మూల ఇంటి గానే పరిగణిస్తారు. అయితే ఈ గృహమునకు వాయవ్యము మరియు ఆగ్నేయము పెరిగి ఉన్నాయి. తద్వారా గృహమునకు ఈశాన్యము కోత పడినట్లే కదా. మామూలుగా చూసినట్లయితే ఈశాన్యంలో ఏ కోత లేనట్లుగా కనిపిస్తుంది, ఎప్పుడైతే వాయవ్య ఆగ్నేయాలు పెరుగుతాయో దాని అర్థం ఈశాన్యము కోతపడినట్లు అనుకోవాలి (అంతే కాకుండా ఇంకో సమస్య కూడా వుంది లెండి). అలా అనుకోవడానికి మనసు ఒప్పుకోకపోతే, వాయవ్య, ఆగ్నేయాలు పెరిగిన గృహంగానే దీన్ని పరిగణించాలి. ఎక్కువగా వాదులాడుకోవడం వల్ల సమయం వ్యర్థమవుతుంది. తూర్పు రహదారి ముందుకు వెళుతూ వెళుతూ, అనగా ఉత్తరానికి వెళుతూనట్లు కనిపిస్తుంది, అయితే జాగ్రత్తగా గమనించినట్లయితే తూర్పు రహదారి వాయవ్యానికి వెళుతున్నట్టుగా స్పష్టంగా అర్థం అవుతుంది. అలాగే ఉత్తర రహదారి తూర్పు వైపునకు వెళుతున్నట్టుగా అనిపిస్తుంది.

తీక్షణ దృష్టితో పరికించినట్లయితే, ఉత్తర రహదారి ఆగ్నేయమునకు వెళుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇటువంటి స్థలములు కొనడం వల్ల లేదా ఇటువంటి గృహములను కొనడం వల్ల గృహస్థులకు వారు ఊహించిన విధంగా ఫలితాలు వస్తాయి అనుకోవడం కల్ల, కొన్ని రకాలైనటువంటి తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది, అయితే కాస్త వెసులుబాటు ఉండవచ్చు. ఇటువంటి గృహాలు కొనే ముందు తప్పనిసరిగా ఒక అనుభవజ్ఞుడైన వాస్తు శాస్త్రవేత్త ద్వారా తగిన సలహాను పొంది తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం వల్ల, జీవితము స్థిరంగా, భద్రత కలిగిన విధంగా ఉంటుంది.
మహోన్నత హృదయం గల మహాఇల్లాలిని ముప్పుతిప్పలు పెట్టిన ఈశాన్య గృహం
సింధూరి గారు దక్షిణ భారతీయులు, చాలా గౌరవప్రదమైన కుటుంబానికి చెందినవారు. 2009వ సంవత్సరంలో అమెరికాకు వెళ్లి అక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 2011వ సంవత్సరం లాస్ ఏంజెల్స్ లో ఒక నూతన గృహాన్ని కొన్నారు. వీరికి గ్రీన్ కార్డు కూడా ఉంది. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల 2016 సంవత్సరంలో Folsom city కి వెళ్లిపోయారు. ముందుగా ఒక కిరాయి గృహాన్ని తీసుకోవడం జరిగింది. 2017 జూన్ నెలలో ఒక గృహమును కొందామనే ఉద్దేశంతో, రకరకాలైన ఇళ్లను చూశారు. అప్పటికే వాస్తు గురించి ఒక అభిప్రాయం ఉండడంతో మంచి వాస్తు గలిగిన గృహాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సింధూరి గారు ఏ విషయంలో కూడా రాజీపడరు, ఉత్తమ మనసు ఉన్న గృహిణి. 4 గృహాలను చూసి, అందులో ఒకటి తీసుకోవాలనే ఉద్ధేశ్యంతో, సరిగ్గా వాస్తు శాస్త్రవేత్తకి డబ్బు కట్టే పరిస్థితులలో ఉండగా, తన భర్త నాన్నగారికి (మామ గారు) విషయం తెలిసి తను కలగజేసుకొని, ఇండియాలో ఉచితంగా చూసే ఎంతోమంది నాకు తెలిసిన వాస్తు శాస్త్రవేత్తలు ఉన్నారు, వారికి చూపించి మీకు ఒక గంటలోపు నేను విషయం చెప్తానని, ఈ గృహాన్ని చివరికి ఫైనలైజ్ చేశారు.

2. కొన్ని రిపేర్లు (దక్షిణం ప్రహారీ లోని ఆకుపచ్చ రంగులో వున్న గీత గురించి క్రింద పేరాలలో చెప్పుకుందాం. ) చేయించుకొని 2017 ఆగస్టు నెలలో గృహప్రవేశం చేశారు. 2019 ఫిబ్రవరి లో కవల పిల్లలు పుట్టారు. ఇద్దరూ అమ్మాయిలే. వీరిలో ఒకమ్మాయికి బ్రెయిన్ ఎదగలేదని తరువాత వైద్యులు చెప్పారు. వీరికి అప్పటికే ఒక అమ్మాయి ఉంది. 2020 లో సింధూరి గారికి తన గృహంలో ఏదో జరుగుతోందని స్పష్టంగా అర్థం అయిపోయింది. ముగ్గురు పిల్లలను ఎల్లవేళలా చూసుకోవడం గగనమైపోయింది, అందులోనూ ఒకమ్మాయి ఉలుకూ లేదు పలుకూ లేదు. కేవలం మూడు సంవత్సరాల లోనే ఊహించనంతటి అనానుకూలతలు గృహంలో ఏర్పడ్డాయి, ఎప్పుడు చూసినా అసంతృప్తి, అది ఏమిటో తెలియదు, విపరీతమైన మానసిక క్షోభ, ప్రతి ఒక విషయాన్ని పదే పదే ఆలోచన చేయడం, చిన్నగా భర్తతో వాదులాటలు, అవి పెరిగి, పెరిగి, చెయ్యి దాటిపోయే పరిస్థితులకు వచ్చేసాయి.
3. చివరికి సింధురి గారే ఇండియాలోని తన మామగారికి ఫోన్ చేసి, ఈ గృహం లోకి వచ్చిన తరువాత తాము అనుభవిస్తున్న విపరీతమైన ఇబ్బందులను తెలిపారు, ఈ ఇంటిలో ఏదో పొరపాటు జరిగింది, దయచేసి మీరు కలగజేసుకొని దీనికి పరిష్కారం చూపమని కోరడంతో, మామగారు వెంటనే 200 రూపాయలు తీసుకున్న ఆ సిద్ధాంతిని పట్టుకొని, ఏం జరిగిందో విచారించారు. ఇల్లు అద్భుతంగా ఉంది మీ కోడలు జాతకం బాగాలేదని, మీ అబ్బాయి జాతకం చాలా బాగుందని తెలిపి చేతులు దులుపుకున్నాడు. ఈ విషయం సింధూరి భర్తకు తెలియడంతో, గృహంలో ఉండే అగ్గి కాస్త దావాలనంలా ఎగసి కుటుంబాన్ని రెండు ముక్కలు చేసే స్థితికి తీసుకొచ్చింది.
4. ఇవన్నీ కాదని, సింధూరి గారు అమెరికా లో గృహాలను చూసే అనుభవమున్న ఒక వాస్తు శాస్త్రవేత్త ద్వారా తన ఇంటిని చూపించుకోవడంతో, అసలైన విషయం బయటపడింది. ఈ గృహానికి ప్రహారి రూపంలో ఉత్తర వాయవ్యం, ఆగ్నేయం పెరగడం, ( అమెరికా దేశంలో ప్రహరీలు సంపూర్ణంగా ఉండవు, సాధారణంగా వెనుక భాగంలో మాత్రమే ప్రహరీలు వేసుకుంటూ ఉంటారు) ఇది కాస్తా వికృత రూపాన్ని సంతరించుకొని, గృహస్థులకు నరకం చూపించింది. ఒక్కసారి ఈ గృహాన్ని పరీక్షించండి. ఈ ప్రహరీ వల్ల ఈ గృహానికి ఉత్తర వాయవ్యము మరియు ఆగ్నేయ భాగాలు పెరిగి చిత్రవిచిత్రమైనటువంటి సమస్యలను సృష్టించాయి. ఒకే ఒక్క పొరపాటు, మొత్తం 3 కుటుంబాలు ఎన్నో నిద్రలేని రాత్రులను చూశాయి.
5. శ్రీమతి సింధూరి గారు వచ్చినది ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి, ఒక గృహమునకు నెలకు 2,750 డాలర్ల కిరాయి కట్టే వారికి వాస్తు శాస్త్రవేత్తలకిచ్చే సంభావన గురించి ఏమాత్రం ఆలోచన చేసే మనస్తత్వం తనకు లేదు. అయితే తన మామగారు ఏదో కుమారుడికి మిగులపెట్టాలని యోచించాడు. అంతేకాకుండా తనకు తెలిసిన వాస్తు సిద్దాంతులు 100 రూపాయలు, లేదా 200 రూపాయలు మాత్రమే తీసుకునేవారు, ఈ చిన్న మొత్తాలను దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా పొరపాటు పడ్డారు. అంతేకానీ, కక్కుర్తి మనిషి అయితే కాదు, వీరు కూడా మంచి ఉన్నత మనస్కులు, గౌరవస్తులు.
6. మామగారి తరపున వాస్తు చూసిన సిద్ధాంతికి ఈ గృహంలోని మార్పులన్నీ తెలిపి ఆయన సరే అన్న తరువాత మాత్రమే, ఆర్కిటెక్ట్ ద్వారా కొటేషన్ తీసుకొని, మార్పులు చేయించారు. మీరు చూస్తున్న ప్రహారి లోని దక్షిణం లో వున్న గ్రీన్ కలర్ లైన్ అనేది పూర్వం వున్న ప్రహారి భాగము. సింధూరి వారు, కొన్ని అవసరాల రీత్యా, HOA వారితో మాట్లాడి, ప్రత్యేకమైన అనుమతి తెచ్చుకొని, ఆగ్నేయం కలుపుకున్నారు.
7. విదేశాలలో నివసించే భారతీయులకు 100 / 200 రూపాయల కన్సల్టెన్సీ గురించి బాగా తెలుసు, అయితే మామగారి మాటకు అడ్డు చెప్పలేక, పాపం శ్రీమతి సింధూరి గారు, ఆ గృహం లో నరకం చూసారు. విదేశాలలో ఉన్న భారతీయులు పొరపాటున కూడా వాస్తు శాస్త్రవేత్తలకు ఎంత ఇచ్చారో ఇండియాలో ఉన్న తమ కుటుంబీకులకు ఎటువంటి పరిస్థితులలోను తెలియజేయరు, ఒకవేళ తెలిస్తే అంతెందుకు ఇచ్చావు, ఇంతెందుకు ఇచ్చావు, ఇక్కడ వంద రూపాయలే కదా లేదంటే 200 రూపాయలు కదా, నీవు మాకు పంపించి ఉంటే మేము చక్కగా చూపించి పెట్టే వాళ్ళం కదా, ఇలాంటి మాటలు వస్తాయని వీరికి బాగా తెలుసు. విదేశాల్లో నివసించే భారతీయులు, ఎల్లవేళలా అభివృద్ధి చెందాలనే చూస్తారు, అంతే తప్పా, పొరపాటుగానైనా ఇటువంటి విషయాలలో తక్కువ ధరకు వచ్చే వారిని అస్సలు నమ్మరు. వీరు విద్యావంతులు, కష్టపడి విదేశాలకు వెళ్లారు, కొరివితో తలగ్గొకోరు.
ఒక్క సంఘటనకు ఇంత చెప్పుకోవాలా, అంత అవసరం ఉన్నదా అని కొందరికి ఒక ప్రశ్న ఉదయించవచ్చు. అవును, ఖచ్చితంగా, ఇంకా వివరాలు ఇవ్వాలి, అయితే కొన్ని పరిస్థితులలో (Search Engine Page Limitations) ఇంతకన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నాము. శుభవాస్తు వెబ్సైటు ను గాలికి తిరిగే వారు చదవరు. సమాజంలో అత్యంత బాధ్యత కలిగిన వారు, గౌరవనీయ కుటుంబసభ్యులు, విద్యావంతులు, అభివృద్ధిని నిండుగా కోరేవారు, ఎల్లవేళలా ఇతరుల శుభములు కోరేవారు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వారు, ఎప్పుడెప్పుడు ఇతరులకు సహాయం చేద్దామా అని ఎదురు చూసేవారు, కార్యదీక్షాపరులు, అకుంఠిత భావం కలిగిన వారు, మంచి హృదయం కలిగిన వారు ఈ వెబ్సైటును చదువుతారు. ఇటువంటి ఎన్ని సంఘటనలైననూ ఎంతో ఓర్పుతో చదివేవారు ఈ శుభవాస్తు వెబ్సైట్ కు తరచుగా వస్తూ ఉంటారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ వెబ్ సైట్ తయారు చేయడమైనది. అంతేకానీ, ఇతరులను నిందిస్తూ కాలం గడిపే వారి కోసం, సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాలో సమయం గడిపేస్తూ ఈ భూమికి భారంగా నిలిచిన వారికోసం, ఏ కార్య దక్షత లేకుండా, జీవితాశయం లేకుండా, సమయాన్ని వ్యర్థపరుస్తూ ఇతరులను నిందిస్తూ కాలం వెళ్ళబుచుతున్న గాలి గాళ్ళ కోసం ఈ వెబ్సైట్ ను తయారు చేయలేదు. గమనించ ప్రార్థన.
ఈశాన్య గృహమునకు ఉత్తర వాయవ్యం పెరిగితే ఎటువంటి ఫలితాలు వస్తాయి?
ఈ చిత్రంలోని ఇల్లు కూడా ఈశాన్య గ్రహమే. ఈ ఇంటికి కూడా ఉత్తరం రహదారి మరియు తూర్పు రహదారి కలవు. అయితే ఈ గృహమునకు ఉత్తర వాయవ్యము బాగా పెరిగినది. తద్వారా గృహస్తులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇలాగా కోణంగా ఉత్తర వాయవ్యము పెరిగిన గృహాల నివాసితులు అనేక ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సివుంటుంది. మానసికక్షోభలు ఉండవచ్చు. ఒకవేళ ఇటువంటి ఇంటిలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వారు షేర్ మార్కెట్ లోకి వెళ్ళవద్దు. ఇటువంటి గృహాలలో ఉన్నవారికి షేర్ మార్కెట్ ఏమాత్రం కలిసి రాదు. అంతేకాకుండా ఇటువంటి ఇంట్లో నివసించే వారికి వ్యాపారాలు ఏ మాత్రం కలిసి రావు. వ్యాపారం బాగా జరుగుతున్నదని, దురాశ పడి అదనపు పెట్టుబడి పెట్టవద్దు. కొద్దిగా చెడు జరిగే అవకాశములు అధికం. అప్పులు విపరీతంగా పెరగవచ్చు. అయితే ఏదో ఒక రోజు సమస్యల నుంచి బయటపడతారు. ఎవరో ఒక రూపంలో కానీ, ఏదో ఒక రూపంలో కానీ వీరి సమస్య పరిష్కారం అయ్యేలా సహాయం చేస్తారు.

ఆగ్నేయ కోణం గా పెరిగిన ఈశాన్యం మూల గృహాలు మంచి ఫలితాలను ఇస్తాయా?

తూర్పు ఆగ్నేయం పెరిగిన ఈశాన్య మూల ఇంటిని కొనవచ్చునా ?
ఈ చిత్రంలో మీకు స్పష్టంగా తూర్పు ఆగ్నేయం పెరిగిన ఇంటిని చూడవచ్చు. మామూలుగా ఇటువంటి గృహాలు ఇంటిలో నివసించే వారికి కొన్ని రకాలైనటువంటి సమస్యలను సృష్టించవచ్చు. ఈ గృహంలో ఉండే వారి వృత్తిని బట్టి కూడా ఫలితాలలో కూడా కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇటువంటి గృహంలో ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకుందాము., అతని మీద అభాండాలు పడే అవకాశం ఉంది. లేదా అతనికి వచ్చే మంచి అవకాశాన్ని ఇతరులు లాక్కోవాలని శతధా ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ గృహస్తులకు ఏదో ఒక రీతిలో విజయం లభించే అవకాశం అధికము. ఉదాహరణకు ఒక ఉద్యోగస్తుడు ఈ గృహంలో ఉన్నట్లయితే, అతనిపై లంచాలు తీసుకున్నాడనే అపవాదు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఇటువంటి గృహాల్లో చిన్నపాటి దొంగతనాలు కావడం, లేదా చిన్నపాటి అగ్నిప్రమాదాలు కావడం, లేదా చిన్నపాటి యాక్సిడెంట్ లాంటివి, జరిగే అవకాశం అయితే ఉంది. ఏ చెడు జరిగినా చిన్నగా అయ్యే అవకాశమే ఉంది, విపరీత స్థాయులలో ఏ నస్టాలు జరగవు. ఒకవేళ గృహములో వాస్తుకు వ్యతిరేకంగా బలమైన నిర్మాణం జరిగినట్లయితే, దోష ప్రభావాలు మరింత అధికం అయ్యే అవకాశం మెండు. జాగ్రత్తలు తీసుకోవడం వలన నివాసితులకే మంచిది.

ఈశాన్య గృహానికి తూర్పు ఆగ్నేయ వీధిపోటు – జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

ఈశాన్య గృహానికి ఆగ్నేయ వీధిపోటు ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది?
ఈ చిత్రపటమును జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా ఈశాన్య మూల గృహమే. ఉత్తరం రహదారి తూర్పుకు సాగిపోయినది, మరియు తూర్పు రహదారి ఉత్తరమునకు సాగిపోయినది. సాధారణంగా ఇటువంటి గృహాలు చాలా మంచి ఫలితాలు ఇవ్వాలి. అయితే ఈ గృహమునకు ఆగ్నేయ భాగం నుంచి ఒక వీధి వచ్చి తగులుతున్నది, అనగా ఈ గృహమునకు ఆగ్నేయ వీధి పోటు కలదు. సాధారణంగా ఆగ్నేయ వీధి పోటు అనునది గృహస్థులకు పరిష్కారం కాని సమస్యలను సృష్టిస్తుంది. తద్వారా గృహస్తులు ఎల్లవేళలా ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం నానా యాగి పడుతుంటారు. దేవస్థానాల చుట్టూ తిరుగుతారు జ్యోతిష్యుల చుట్టూ తిరుగవచ్చు. ఇలాగ గృహస్తులు నానా తిప్పలు పడుతూ ఉంటారు. ఈ గృహమునకు ఆగ్నేయ వీధి పోటు ఉన్ననూ, అదృష్టవశాత్తు ఇది ఈశాన్యం మూల గృహము అయినందువల్ల ఆగ్నేయ వీధి పోటు ఫలితాలు బలమైన చెడును కలిగించకుండా ఈశాన్యం నిరోధిస్తుంది. అనగా ఈ గృహస్తులకు పరిష్కారం లభిస్తుంది. సమస్యలు అయితే వస్తాయి, కానీ పరిష్కారం కూడా లభిస్తుంది.

ఈశాన్య గృహానికి ఉత్తర-వాయవ్య వీధిపోటు ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి?

చాలా సందర్భాల్లో ఈ సమస్యకు పరిష్కారం అనేది చాలా తేలికగా అమలు చేయవచ్చు. అయితే, అసలు సమస్యను సమగ్రంగా విశ్లేషించకుండా ఏదో ఒక ఉపాయాన్ని వెంటనే అమలు చేయడం సరైనది కాదు. సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని, దాని ప్రభావాలను గమనించి, తగిన ప్రణాళికతోనే పరిష్కారం దిశగా ముందుకెళ్లాలి. చెట్లు నాటడం, సైన్‌బోర్డులు పెట్టడం, ఒక షాపు ఏర్పాటు చేయడం లేదా కారు షెడ్ నిర్మించడం వంటి ఉపాయాలు ఉపయోగకరమే అయినా, అవి నిజంగా సమస్యను తగ్గిస్తాయా లేదా అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. కొన్ని మార్పులు తక్షణ ప్రయోజనం కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలికంగా చూస్తే, అవి సమస్యను మరింత పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే, పరిష్కార చర్య తీసుకునే ముందు దాని ప్రభావాలను విశ్లేషించి, అవసరమైన మార్పులను మాత్రమే అమలు చేయడం అత్యవసరం.
ఈ గృహాన్ని వాస్తవంగా ఈశాన్య గృహంగా పరిగణించవచ్చునా?
ఈ గృహం ఈశాన్య గృహమా? కొన్ని సంఘటనలను ఇక్కడ తెలియ చెయ్యాల్సి ఉన్నది, అయితే కొన్ని ప్రత్యేక కారణాల వలన, కొందరి వివరాలను ఇవ్వలేకపోతున్నాము. భవిష్యత్తులో కొందరి అనుభవాలను ఇక్కడ పంచుకుందాం. ఈ గృహమునకు రెండువైపులా రహదారులు ఉన్నాయి. ఈశాన్య రహదారి, ఆగ్నేయ రహదారి. ఈశాన్యం వైపున ముఖద్వారం ఉంటే ఫలితాలు ఉత్తమంగా ఉంటాయి. సాధారణంగా, తూర్పు ముఖ గృహాలు చాలా శుభప్రదమైనవి, ఇది ఆరోగ్యం, బుద్ధి, మరియు విజయానికి సహాయపడుతుంది. ఒకవేళ ముఖద్వారం ఆగ్నేయం దిక్కుకు ఉంటే, కుటుంబంలో ఆగ్రహాన్ని, ఆర్థిక ఒడిదుడుకులను, మరియు అనవసరమైన ఖర్చులను పెంచే అవకాశం ఉంది, ఇంట్లో ఉండే వ్యక్తులకు మానసిక ఉత్కంఠ, నిర్ణయాలలో అస్పష్టత, మరియు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, కుటుంబ సభ్యుల మధ్య ఒప్పంద లోపం, చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారడం, అలాగే అనవసరమైన తగాదాలు తలెత్తడం వంటి సమస్యలు చోటుచేసుకోవచ్చు. అయితే, ఇంటి నిర్మాణం మరియు స్థల నిర్మాణ పరంగా సరైన మార్పులు చేస్తే, ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు.

గృహస్థులు ఇంటి లోపల నిర్మాణం విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటే, మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఎంతో అనుభవమున్న వాస్తు శాస్త్రవేత్త చే గృహాన్ని, లేదా గృహ నమూనా పటమును పరిశీలింప చేయించుకోండి. వారు మీకు తప్పకుండా తగిన సహాయం చేస్తారు. ఒకవేళ గ్యారేజ్ (garage ) ఈశాన్యం లో ఉండి, ముఖద్వారం ఆగ్నేయంలో ఉంటే?, ఎలా చెయ్యాలి, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?. ఒక ఒకవేళ గ్యారేజ్ (garage ) ఆగ్నేయంలో ఉండి, ముఖద్వారం ఈశాన్యం లో ఉంటే?, ఎలా?, ఇటువంటి పరిస్థితులలో తమరు అపార్థం చేసుకోకపోతే, బాగా అనుభవమున్న ఒక వాస్తు శాస్త్రవేత్తచే ప్రతివిషయం పరిశీలింప చేయించుకొని ఆ పిదప తగిన నిర్ణయం తీసుకోవడం మేలు.
ఈ ఇంటిని ఈశాన్య గృహంగా అభివర్ణించడంలో వాస్తు నిపుణులు ఏమంటారు?
ఈ గృహానికి వాయవ్య-ఈశాన్య రహదారులు కలవు. ఇది వాస్తు శాస్త్రం ప్రకారం మిశ్రమ ప్రభావాలను కలిగించగలదు. ముఖ్యంగా ఇటువంటి స్థలముల నందు, ద్వారం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ముఖద్వారం విషయంలో గృహస్థులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ముఖద్వారం ఇంటి శుభ-అశుభ ఫలితాలను ప్రభావితం చేయగల ముఖ్యమైన అంశం. ఈశాన్యం దిశ సాధారణంగా శుభప్రదమైనదిగా భావించబడుతుంది, ఎందుకంటే ఇది ఆరోగ్యం, ధనం, విజయం, మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే దిశ. వాయువ్య దిశ, ఇది కొన్ని సందర్భాల్లో మానసిక స్థిరత్వాన్ని, సంబంధాల్లో అనుమానాన్ని, మరియు ఆర్థిక అనిశ్చితిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈశాన్యం శక్తిని పూర్తిగా ఉపయోగించుకోగలిగితే, గృహస్థులకు అదృష్టం, అభివృద్ధి మరియు ప్రశాంతత లభించవచ్చు. కానీ వాయువ్య లో ముఖద్వారం ఏర్పాటుచేసుకున్నట్లయితే వ్యతిరేక ప్రభావం చూపించే అవకాశం అధికంగా ఉంది. కొన్ని సందర్భాల్లో గృహస్తులు ఆర్థిక ఒడిదుడుకులు, మానసిక ఒత్తిడులు, మరియు కుటుంబ విభేదాలు అనుభవించే అవకాశం ఉంది. ఈ రకమైన గృహాల్లో గృహ ద్వారం స్థానం ఎంతో కీలకం. ఈశాన్యం వైపు ముఖద్వారం ఉంటే , ఇది మంచి ఫలితాలను అందించగలదు.

అయితే, వాయువ్య వైపు ముఖద్వారం ఉంటే, ప్రతికూల ప్రభావం కలుగుతుంది. వాస్తు రీత్యా ఇంటి నిర్మాణం ఉండేలా చూసుకుంటే, వాయవ్య దోషాలను, సమస్యలను తగ్గించుకోవచ్చు. ఒకవేళ గ్యారేజ్ (garage ) ఈశాన్యం లో ఉండి, ముఖద్వారం వాయవ్యంలో ఉంటే?, ఎలా చెయ్యాలి, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?. ఒక ఒకవేళ గ్యారేజ్ (garage ) వాయవ్యంలో ఉండి, ముఖద్వారం ఈశాన్యం లో ఉంటే?, అపార్థం చేసుకోకపోతే, ఒక అనుభవజ్ఞుడైన వాస్తు శాస్త్రవేత్త చే పరిశీలింప చేయించుకొని తదుపరి నిర్ణయం తీసుకోవడం మేలు.
ఈశాన్య మూలలో గృహం మరియు చుట్టూ ఖాళీ స్థలాల ప్రభావం - వాస్తు విశ్లేషణ
ఈ చిత్రం లోని నీలి రంగు గృహం, ఈశాన్య మూల (Northeast Corner) లో ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం మూల గృహం అత్యంత శుభప్రదమైనది. ఈశాన్య మూల గృహాలు సాధారణంగా శుభఫలితాలను అందిస్తాయి. తూర్పు మరియు ఉత్తర రహదారులు కలిగి ఉండటం వాస్తు శాస్త్రం ప్రకారం మంచి లక్షణం. ఇది ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని మరియు కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలను ప్రోత్సహించగలదు . ఈ మొత్తం స్థలాలలో ఒక్క గృహం మాత్రమే ఈశాన్య మూలలో నిర్మించబడింది , మిగిలిన అన్ని ప్లాట్లు / స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ఈశాన్య గృహానికి దక్షిణం మరియు పడమర వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉండటం వాస్తు దృష్ట్యా ప్రతికూల ప్రభావాలు కలిగించవచ్చు. ఇది ఆర్థిక నష్టం, అనిశ్చితి, అనారోగ్యాలు, మరియు కుటుంబ సభ్యుల మధ్య ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఈ స్థలాన్ని కొనుగోలు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం సులభం కాదు. ఈశాన్య మూలలో గృహం ఉండటం శుభప్రదమైనదే అయినా , దక్షిణం మరియు పడమర వైపు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడం వల్ల ప్రతికూలతలు లేకుండా ఉండేందుకు వాస్తు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. స్వంత నిర్ణయం భవిష్యత్తులో బలమైన ఇబ్బందులను కలిగించవచ్చును.

ఆగ్నేయ ముఖ ద్వారం ఉన్న ఈశాన్య గృహం – వాస్తు శాస్త్రం ఏమంటుంది?
ఆగ్నేయ ముఖ ద్వారం ఉన్న ఈశాన్య గృహం. వాస్తు శాస్త్రం ప్రకారం మిశ్రమ ప్రభావాలను కలిగించగలదు. సాధారణంగా ఈశాన్యం దిశ ఇంటి నిర్మాణానికి అత్యంత శుభప్రదమైనదిగా భావించబడుతుంది, ఇది ఆరోగ్యం, ధనం, విజయం, మరియు శాంతిని ప్రోత్సహిస్తుంది. కానీ, ఆగ్నేయ ముఖద్వారం కలిగి ఉండటం వల్ల కొన్నిసార్లు బలమైన ప్రతికూల ప్రభావాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయం అగ్ని తత్వానికి సంబంధించినది , కాబట్టి, ఈ తలుపు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఒడిదుడుకులు, మానసిక ఒత్తిడులు, మరియు కుటుంబంలో విభేదాలు, అశాంతి, అసౌకర్యాలు, కలిగించే అవకాశముంది. ఇంట్లో మహిళల ఆరోగ్యం ప్రభావితమయ్యే అవకాశముంది. ఈ రకమైన గృహాల్లో ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యుల్లో అధిక ఆగ్రహ భావాలు పెరగడం, మరియు నిద్రలేమి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, ఇంటి అంతర్గత వాస్తు నిర్మాణం సరైన విధంగా ఉంటే, చెడు ప్రభావాలను కొంతవరకు నియంత్రించుకోవచ్చు. ఈశాన్య గృహానికి తగిన ముఖద్వారం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం, ఇంటి నిర్మాణాన్ని సరైన రీతిలో ప్లాన్ చేయడం, మరియు వాస్తు నిపుణుల సూచనలు పాటించడం ద్వారా శుభప్రభావాలను పొందడం సాధ్యమవుతుంది.

తూర్పు రహదారి ఉత్తరానికి సాగిపోయిన ఈశాన్య గృహం
ఈ ఇంటికి తూర్పు మరియు ఉత్తర రహదారులు కలవు. ఈ గృహం కూడా ఈశాన్య గృహమే. ఈ గృహమును మరియు రహదారులను చాలా జాగ్రత్తగా గమనించండి తూర్పు రోడ్డు ఉత్తరానికి సాగిపోయింది, ఉత్తరం రోడ్డు తూర్పు రోడ్డు దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఈ విషయాన్ని మీరు శ్రద్ధగా గమనించి మనసులో పెట్టుకోండి. ఇలాగా ఉత్తరం రోడ్డు ఆగిపోయి తూర్పు రోడ్డు ఉత్తరానికి సాగినప్పుడు మహాద్భుతమైన ఫలితాలైతే ఆశించవద్దు. ఈ గృహం మంచి ఫలితాలే ఇస్తుంది, కానీ అత్యంత విశేషమైన వాస్తు ప్రయోజనాలను ఆశించడం అనవసరం. మనం పరిసరాల వాస్తు గురించి మాట్లాడడం లేదు, కేవలము ఈ ఈశాన్యం ప్లాట్ / ఇల్లు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము. దయచేసి ఒక్క విషయం గమనించండి ప్రతి ఒక్క ఈశాన్యం మూలలో నిర్మించిన గృహాము అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని లేదా ప్రతి ఒక్క ఈశాన్య మూల గృహం కూడా సమమైన ఫలితాలు ఇస్తాయని చాలామంది అపోహ పడుతుంటారు. ఈ లింక్ నందలి విషయాలు చదివిన తరువాత ఎన్నో అపోహలు తొలగిపోవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే, మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి.

ఉత్తర రహదారి తూర్పుకు సాగిపోయిన ఈశాన్య గృహము – వాస్తు ప్రభావాలు, ఫలితాలు
ఈ ఇంటికి కూడా తూర్పు మరియు ఉత్తర రహదారులు కలవు. ఈ గృహం కూడా ఈశాన్య గృహమే. రహదారులను చాలా జాగ్రత్తగా గమనించండి ఉత్తరం రోడ్డు తూర్పుదిక్కుకు సాగిపోయింది. తూర్పు రోడ్డు ఉత్తర రహదారి దగ్గర ఆగిపోయింది. చాలా చిన్న మార్పు, అయితే, ఫలితాల విషయం లో తేడాలు గమనించవచ్చును. ఇలాగా ఉత్తరం రోడ్డు తూర్పుదిక్కుకు సాగిపోయి, తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు దగ్గర ఆగిపోయినప్పుడు, ఫలితాలు బాగా ఉంటాయి. ఈ గృహం మంచి ఫలితాలే ఇస్తుంది, విశేషమైన వాస్తు ప్రయోజనాలను ఆశించవచ్చు, (ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి, లేదా రాష్ట్రపతి కావాలి అనే కోరికలైతే నెరవేరవు) మనం పరిసరాల వాస్తు గురించి మాట్లాడడం లేదు, కేవలము ఈ ఈశాన్యం ఇల్లు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము. చూశారుగా ఎంత చిన్న మార్పు, అయితే ఫలితాల విషయంలో స్పష్టంగా తేడాలు గమనిస్తున్నాము. వాస్తు శాస్త్రంలో అత్యంత చిన్న మార్పు కూడా ఫలితాల విషయంలో తారుమారు చేయవచ్చు. మాది కూడా ఈశాన్యం గృహమే అయితే మాకు మంచి ఫలితాలు రావడం లేదు అనేవారు కొందరు ఉంటారు, అటువంటి వారికి ఈ లింకులోని విషయాలు చూపిస్తే తమ గృహంలో తేడా ఎక్కడుందో తెలుసుకోగలరు.

తూర్పు - ఉత్తర రహదారులు సాగిపోయిన ఈశాన్య గృహ వాస్తు ప్రభావాలు

నిర్మాణం చేసుకునే సమయంలోనే తూర్పు మరియు ఉత్తర దిక్కులలో ఎక్కువ ఖాళీ స్థలం వదులుకోవడం మరియు దక్షిణ మరియు పశ్చిమ వైపున తక్కువ ఖాళీ స్థలం వదులుకోవడం వల్ల ఫలితాలు ఇంకాస్త ఆనందకరంగా ఉంటాయి. ఈశాన్య ప్లాట్ నుండి మీరు ఎంత ఉన్నత స్థితిని ఆశిస్తాలో, అలాగే గృహమును కూడా వాస్తు శాస్త్రరీత్యా నిర్మాణం చేసుకున్నట్లయితే ఫలితాలలో లోపం లేకుండా, జీవితం ఆనందంగా గడిచిపోతుంది.
ఉత్తర ఈశాన్యం పెరిగిన ఈశాన్య గృహం, ఫలితాలు ఎలా ఉంటాయి?

తూర్పు, ఈశాన్యం పెరిగిన గృహం - అదృష్టానికి మార్గమా లేదా సమస్యకు కారణమా?
దయచేసి తమరు ఏమీ అనుకోకుండా ఒక్కసారి పైన చూపించిన నాలుగు చిత్రపటములను గమనించి ఆ తర్వాత ఈ చిత్రపటం చూడండి. జాగ్రత్తగా చూసినట్లయితే తూర్పు రహదారి ఈ గృహమునకు తూర్పు ఈశాన్యం పెంచుతూ ఉత్తరానికి సాగిపోయినది. సాధారణంగా ఇటువంటి గృహాలు నివాసితులకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. తూర్పు ఈశాన్యం పెరిగినటువంటి స్థలములలో గృహమును వాస్తు శాస్త్ర రీత్యా నిర్మించినట్లయితే గృహస్తులు అద్భుతమైన ఫలితాలను పొందగలరు. పిల్లలకు విద్య బాగా వస్తుంది, కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగా ఉంటుంది, జీవితంలో స్థిరత్వం ఉంటుంది, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు, సంఘంలో వీరి మాట చెల్లుతుంది, ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది, ఇతరుల మీద, ఈ గృహ నివాసితులకు కొంచెం జాలి దయ అనేవి ఉంటాయి. దయచేసి గమనించండి, ముఖ ద్వారం ఏర్పాటు చేసిన ప్రదేశం అనేది అత్యంత ముఖ్యమైనది. ఒకవేళ ఇటువంటి గృహాలకు ముఖ ద్వారము వ్యతిరేక దిశలలో ఏర్పాటు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు బాగా తగ్గి, చెడు ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది.

తూర్పు, ఉత్తర ఈశాన్యం పెరిగిన గృహాలు ఆనందాన్ని ఇస్తాయా, లేక విషాదాన్ని ఇస్తాయా?

సాంకేతిక నిపుణుల సహాయం కావలెను
– : దాతల సమాచారం : –
ఎంతోమంది గృహస్థులకు తమకు జన్మనిచ్చి, ఉన్నతంగా తీర్చిదిద్దిన తమ తల్లిదండ్రుల పేర్లను లేదా తమ పెద్దల పేర్లను చిరస్థాయిగా ఈ సమాజంలో నిలిచిపోయెందుకు భారీ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది చాలా మంచి పరిణామము, మరియు వీరి ఆలోచన అద్భుతం, అపూర్వ సృజనాత్మకత. ఒక వేళ మీకంటూ ఇటువంటి ఆలోచన ఉన్నట్లయితే మీ లోకల్ లాంగ్వేజ్ లో వెబ్సైట్ తయారవుతున్నది. మీరు మీ పెద్దల పేర్లను చిరస్థాయిగా ఈ సమాజంలో నిలిపి ఉంచడానికి, వారి పేర్లు, పేర్లతో పాటుగా చిత్రపటములను కూడా ముద్రిస్తాము. ఈ వెబ్సైటు ఉన్నంతకాలం మీ పేరు, లేదా మీ తల్లితండ్రుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. మొత్తం వెబ్ సైట్ అంతయు మీరు స్పాన్సర్ చేయవచ్చు. లేదా ఒక ప్రత్యేకమైన పేజీ ను స్పాన్సర్ చేయవచ్చు. సింగల్ టైం పేమెంట్ మాత్రమే. ప్రతి సంవత్సరం కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు స్పాన్సర్ చేయాలని అనిపిస్తే ఈ లింకు ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు, తదుపరి మిగిలిన సమాచారంను అందజేయగలము. https://www.subhavaastu.com/contact-us.html
– : SPONSORSHIP : –
Many residents are committed to honoring the names of their parents, grandparents, or elders, with the aim of keeping their legacy vibrant in their respective societies. This admirable effort is truly heartening. If you feel a connection to this endeavor, our website, thoughtfully crafted in your native language, offers a supportive platform while deeply respecting your sentiments. We are dedicated to helping you ensure that the names of your loved ones are remembered with respect and fondness. You have the option to sponsor either the entire website or a specific page, all with a single payment, freeing you from the concern of annual fees. In doing so, the names of those dear to you will be cherished and celebrated for as long as our website continues to exist. If you’re interested in this meaningful tribute, please contact us for more information : https://www.subhavaastu.com/contact-us.html