పశ్చిమ దిశ గృహ వాస్తు వివరణ - పడమర దిక్కు ఫలితాలు
పశ్చిమ దిక్కును, పడమర దిశ లేదా సూర్యాస్తమయ దిశ ( అరుదుగా ) అని కూడా అంటారు. ఈ పశ్చిమ దిశ దిక్సూచి నందు 270° చూపిస్తుంది. పశ్చిమ దిక్కు వాయువ్య మరియు నైరుతి దిశల మధ్య భాగంలో ఉంటుంది. పశ్చిమ భాగమునకు అధిపతి వరుణుడు, గ్రహాధిపతి శని మహాత్ముడు. సాధారణంగా పశ్చిమ భాగం ఫలితాలు ఇంటి నందలి మగవారిపై ఉండవచ్చును. వాస్తురీత్యా పశ్చిమ దిశ బాగా ఉంటే కుటుంబ సభ్యులు ముఖ్యంగా, మగవారు ఆరోగ్యకరంగా, దృడంగా, మానసికంగా శక్తి కలిగి ఉంటారు మరియూ, వీరు చేసే వృత్తి లో స్థిరత్వం కలిగి వుంటారు.

గౌరవనీయ పాఠకులకు ఒక విజ్ఞప్తి. ఈ వెబ్సైటు లో మాకు తెలిసిన విషయాన్ని, అనుభవాలను, పరిజ్ఞానమును ప్రచురించాము. విషయాలను వివరించేప్పుడు కొన్ని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, అనుభవ పరిజ్ఞానాన్ని సమీకరించుకొని కొన్ని పరిస్థితుల రీత్యా, వాస్తు ప్రభావం గురించి మంచి లేదా చెడును తెలుపుతూ విషయాన్ని ప్రచురించాము. ఏదైనా ఇలాగే జరగాలి, అలాగే జరగాలి అనే నిబంధన లేదు. విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే ఇక్కడ సమాచారమును ప్రచురించడం జరిగినది. అంతేకానీ దీనిని దృష్టిలో పెట్టుకొని గృహస్తులు స్వతహాగా ఏ నిర్ణయం తీసుకోరాదని మా ప్రత్యేక విజ్ఞప్తి.
పశ్చిమ దిశ గృహం కొంటే ఏమైనా సమస్యలు వస్తాయా?
పశ్చిమ దిశ గృహం కొనడం వల్ల కొత్తగా ఏ సమస్యలూ రావు. దయచేసి ఒక్క విషయాన్ని గమనించండి. ఏ దిక్కు గృహమైననూ వాస్తు రీత్యా బాగా వున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. ఒకవేళ వాస్తు రీత్యా సరిగా లేకపోతే, ఏ దిశ గృహమైననూ మంచి ఫలితాలు ఇవ్వడం కష్టం. కొందరి అభిప్రాయం ఏమిటంటే, పశ్చిమ దిశ గృహాలు అంతగా యోగించవని, అయితే ఇది అవాస్తవం.
కొన్ని సందర్భాలలో మాత్రమే ఈ దిక్కును సున్నితమైన దిక్కు అని కూడా అనుకోవచ్చు, అది ఎలాగంటే ఏ చిన్న పొరపాటు జరిగినా ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉండవచ్చును. అందుకే కొందరు పశ్చిమ దిశ గృహాలను, లేదా దక్షిణ దిశ గృహాలను కొనవద్దు అని అంటుంటారు. కేవలం తూర్పు దిశ వాస్తు గృహాలు లేదా ఉత్తర దిశ వాస్తు గృహాలు కొనమని చెబుతుంటారు. ఒకవేళ ఈ రెండు దిశలు మాత్రమే మహా ఉత్తమమైనవని అనుకునేటట్లయితే, మరి ప్రతి పశ్చిమ, దక్షిణ దిశ లలో గల గృహాలు లేదా సంస్థలు నష్టాలపాలవుతారని అనుకోవాలా ! లేదా నష్టపోయారని తెలుసుకోవాలా !!
దయచేసి ఇక్కడ ఒక విషయాన్ని శ్రద్ధగా గమనించండి, వాస్తుకు బాగా లేని ఏ దిశ గృహమైనా కలిసిరావాలంటే కష్టమే. వాస్తుకు బాగా వున్న ఏ దిశ గృహమైననూ గృహస్థులకు వారు తలపెట్టే కార్యక్రమాలలో యోగించేలా చేసే అవకాశాలు అధికం. ఈ తెలుగు వాస్తు వెబ్సైట్ వ్యాసంలో మనం సాధ్యమైనంతవరకూ ప్రతి విషయాన్ని తెలుసుకుందాము.
పడమర దిశ గృహము అని మనకు ఎలా తెలుస్తుంది?
ఈ చిత్రంలోని గృహమునకు ఎడమవైపున ఒక రహదారి కలదు. దాని పైన “పశ్చిమ రహదారి” అని కనపరచడం చూడవచ్చు. అనగా ఈ గృహం పశ్చిమ వీధికి తిరిగి వున్నది. కావున ఈ గృహం పశ్చిమ వీధి గృహం అవుతుంది, లేక పశ్చిమ దిశ గృహం అని పిలవడం జరుగుతుంది. పశ్చిమ దిశ వాస్తు దోషాలు ఉన్నట్లయితే గృహస్థుల జీవనం మీద వ్యతిరేక ప్రభావం పడవచ్చు. అనగా చేసే ఉద్యోగం పోవడమో, లేక అనారోగ్యం పాలు కావడమో, లేదా భారీ ఎత్తున ఆర్థిక నష్టం కలగడమో జరిగే అవకాశం ఉండవచ్చును. కావున పశ్చిమ దిశ వాస్తు దోషములు లేకుండా చూసుకోవడం ముఖ్యం. దయచేసి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఈ పశ్చిమ వాస్తు దోషాలనేవి, ఏ దిక్కు గృహములకైననూ ఉండవచ్చును, కేవలం పశ్చిమ దిశ గృహాలకు మాత్రమే పరిమితం అనుకోరాదు. ఒక్కొక్కసారి కాస్త అనుభవం తక్కువగా వున్న వాస్తు సిద్ధాంతిలే ఈ పశ్చిమ గృహ వాస్తు విషయాలలో పొరపాట్లు చేస్తుంటారు. కావున గృహస్తులు స్వంత ప్రయోగాలు మాని, బాగా అనుభవం ఉన్న వారిచే వాస్తు సలహాలు పొందగలరు.

పశ్చిమ దిశ గృహం యొక్క లక్షణాలు
1. సాధారణంగా పశ్చిమ దిశ గృహము వాస్తుకు సరిగా ఉన్నప్పుడు మగవారికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి.
2. వాస్తుకు సరిగా ఉన్న పశ్చిమ దిశ గృహంలో ఏ కార్యం పట్టుకున్నా విజయవంతం అవుతుంది. అంతేకాక సమాజంలో బాగా పలుకుబడి ఉంటుంది.
3. వీరికున్న ఒక ప్రత్యేకత వల్ల, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, లేదా చిన్నచిన్న రాజకీయ నాయకులను అప్పుడప్పుడు కలిసే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు, అంతే కాకుండా రాజకీయాలలో బాగా రాణించడానికి అవకాశం ఎక్కువ. నాయకుల దగ్గర వీరికి గుర్తింపు వుండే అవకాశం వుంది. రాజకీయ నాయకులూ కాకపోయినా, సమాజం లో ప్రముఖ స్థానం లో వున్న వ్యక్తుల దగ్గర గౌరవం లభించే అవకాశం ఎక్కువగా వున్నది.
4. రాజకీయ నాయకులకు అనుచరులు బాగా ఉంటారు, అంతేకాకుండా నాయకుల కార్యక్రమాలు విజయవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉండవచ్చును.
5. కొందరు గృహస్తులు పశ్చిమ ముఖ గృహం అనుకొని, కొన్న తర్వాత చూసుకుంటే ఆ గృహం పశ్చిమ నైరుతికి తిరిగి ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మాత్రం చెడు ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంది. దయచేసి గమనించండి, ఈ నిబంధన ప్రతి దేశంలోని గృహాలకు వర్తించదు. ఉదాహరణకు, ఉత్తర అమెరికా దేశం, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, తదితర దేశాలు.
6. ఒక్కొక్కసారి తెలియక కొందరు గృహస్తులు పశ్చిమ దిశ గృహం అనుకొని పశ్చిమ వాయువ్యానికి తిరిగిన గృహాలను కొనడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఈ గృహస్తులు ఈ సమస్య వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చును. ఇంటియందలి వాస్తు పట్టును బట్టి, సమస్యలు తక్కువగా ఉండవచ్చును, లేదా అత్యంత ఇబంది కరమైన అనుభవాలు ఎదురుకావచ్చు.
7. ముఖ్యంగా ప్రధాన ద్వారం పశ్చిమ దిశలో ఉంటే. పశ్చిమ దిక్కుకు ఉన్న గృహాలు శక్తి మరియు సంపదను ఆకర్షించగలవు. చాలామంది అనుకున్నట్టుగా పశ్చిమ ద్వారము చెడు ఫలితాలు ఇస్తుందని అనుకోవచ్చు, అయితే వాస్తుకు సరిగా ఏర్పాటు చేసిన పశ్చిమ ద్వారం శుభ ఫలితాలను ఇవ్వగలదు. ఇంకో విధంగా చెప్పాలంటే ఇదొక శక్తి ప్రవాహం అని అనుకోవచ్చును.
8. వీరు చేసే ఏ వృత్తిలోనైనా వీరికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండే అవకాశం అధికము. ఎంత కాదనుకున్నా ఇతరులతో పోలిస్తే సమాజం లో కొద్దిగా వీరికి ప్రాముఖ్యత ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది.
9. ఈ గృహస్థులకు పట్టుదల ఎక్కువగా ఉండవచ్చును. ఈ గృహస్థులు ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుంటే అంత సులభంగా వదలరు. దాని అంతు తేల్చే దాకా ఆ సమస్యను వదలకపోవచ్చును. వీరికి కాస్త పట్టుదల మరియు రోషం అధికంగా ఉండే అవకాశం కూడా ఉంది.
పశ్చిమ దిశలో ఏ గదులను నిర్మించుకోవాలి మరియు ఏమేమి ఉంచుకోవచ్చు?
సాధారణంగా, ఈ పశ్చిమ దిశలో ఈ క్రింద చూపించిన గదులను ఏర్పాటు చేసుకోవచ్చును. బెడ్‌రూమ్, నిల్వ గది ( స్టోర్‌రూమ్ ), ప్రవేశమార్గం ( ఎంట్రన్స్ డోర్ ), ఫోయర్, లివింగ్ రూమ్, పూజా గది, భోజనాల గది ( డైనింగ్ రూమ్ ), చదువుకునే గది ( స్టడీ రూమ్ ), సమావేశాల గది ( కాన్ఫరెన్స్ రూమ్ ) , కుటుంబ గది ( ఫామిలీ రూమ్ ), గృహ కార్యాలయం గది ( హోమ్ ఆఫీస్ రూమ్ ), అతిథుల వేచి చూడు గది ( గెస్ట్స్ వెయిటింగ్ రూమ్ ), తాగు నీటి గది ( డ్రింకింగ్ వాటర్ రూమ్ ), భారీ వృక్షాలు, వృక్షాలు, చాలా బరువైన పూల కుండీలు, పూల మొక్కల కుండీలు, మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. వాటర్ క్యాన్, గ్రంథాలయం, ప్రదర్శన కేసులు ( షో కేసు ), మగపిల్లల బెడ్‌రూమ్, సమావేశ హాల్ ( మీటింగ్ హాల్ ), ఇంటి పైన ఉండే నీటి ట్యాంకులు ( ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ), మెట్లు ( సోపానాలు, స్తైర్ కేస్ ), వాహనాలు, మరియు కొన్ని పరిస్థితులలో వంటగది లను ఏర్పాటు చేయవచ్చు. కొన్ని షరతులపై శౌచాలయాలు, స్నానాల గదులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

పశ్చిమ ముఖ ద్వార గృహం ద్వారా లభించే శుభ ఫలితాలు
1. వాస్తు శాస్త్రం ప్రకారం పశ్చిమ ముఖంగా ఉండే గృహాలు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. సంఖ్యల వారీగా జాబితా చేయబడిన కొన్ని ముఖ్య ప్రయోజనాలను ఇక్కడ తెలియచెయ్యడమైనది. ప్రత్యేకించి ప్రధాన ద్వారం పశ్చిమ దిశలోని సానుకూల మండలాల్లో/ దిశకు ఉంచినట్లయితే పశ్చిమ ముఖంగా ఉండే గృహాలు నివాసులకు శ్రేయస్సు మరియు విజయాన్ని ప్రసాదించవచ్చు. సాధారణంగా అమెరికా దేశంలోని అనేక రాష్ట్రాలలో పశ్చిమ ముఖ ద్వార గృహం తీసుకున్నట్లయితే ఇంటి ముందు కన్నా, ఇంటి వెనుక వైపున ఎక్కువ కాళీ స్థలం రావడం అనేది అక్కడ సర్వసాధారణమైన విషయం. పశ్చిమ ముఖ ద్వారం గృహమునకు ఇంటి వెనుక భాగం అనగా తూర్పు దిశ అని అర్థం, నిజమే కదా !! ఏప్పుడైతే తూర్పు దిశలో ఎక్కువ కాళీ స్థలం వస్తుందో అప్పుడు ఆ గృహస్థులకు మంచి జరిగే అవకాశం ఎక్కువ అనే విషయం మీ అందరికీ తెలుసు కదా!!

అందుకే కాబోలు, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, న్యూజిలాండ్, తదితర దేశాలలోని పశ్చిమ ద్వారం గృహంలో నివసిస్తున్న గృహస్తులు “చాలా తక్కువ మంది” మాత్రమే తమకు సమస్యలు ఉన్నాయి అని తెలుపుతారు. అయితే ఈ విషయం తెలియని చాలా మంది గృహస్తులు కేవలం తూర్పు గృహం లేదా ఉత్తర గృహం మాత్రమే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని వాటికోసం తమ శక్తికి మించి ధనం పోసి గృహాలు కొంటూ ఉంటారు. తమ జీవితంలో అర్థ భాగం ఈ గృహానికి తీసుకున్న రుణం తీర్చడానికి సరిపోతుంది.
2. వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మితమైన పశ్చిమ దిశ గృహాల శుభ లక్షణాలు చాలా ఉన్నాయి, అందులో మనం కొన్నింటి గురించి మాత్రమే చర్చించుకుందాము. నాయకులకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం అధికం. సాధారణంగా, ఈ గృహాలు నాయకత్వ విషయాలలో నిమగ్నమైన వ్యక్తులకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉండవచ్చును. నాయకులకు విజయం వరించే అవకాశం ఉన్నది. సామాజిక గౌరవం మరియు ప్రస్తుతం ఉన్న తమ స్థానము పెరుగవచ్చు. వాస్తు ఉన్నతమైన పశ్చిమ దిశ గృహాలు స్థిరత్వం మరియు వృద్ధికి ప్రతిరూపకంగా భావించవచ్చును.
3. పశ్చిమం వైపు ఉన్న ఇళ్లలో నివసించేవారు వారి సామాజిక స్థితి మరియు సమాజంలో గుర్తింపు విషయంలో మెరుగుదలని గమనించవచ్చు లేదా అన్నీ అనుకూలమై అనుభవించవచ్చు, మరియూ ఈ విషయంగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లయితే ఫలితాలు వారికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. కళాకారులకు మరియు సృజనాత్మక రంగాలలో పనిచేసేవారికి అనుకూలం ఉంటుంది మరియూ కొందరికి ఉత్సాహం ఉరకలు వెయ్యవచ్చు. అదే ఉత్సాహంతో వారి కార్యక్రమాలను విజయవంతం చేసుకోవచ్చును.
4. వాస్తు ప్రకారం, పడమర ముఖంగా ఉండే ఇంటిలో నివసించడం వల్ల నివాసితులకు మంచి ఆరోగ్యం, తేజము మరియు చైతన్యం లభించే అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఈ దిశ గృహాలు నివాసితులకు యవ్వన శక్తిని, మరియు సృజనాత్మకతను మేల్కొల్పుతాయి. విద్యాభ్యాసం మరియు జ్ఞానం పెరుగుతాయి. ఈ గృహాలు విద్యార్థులకు చదువులో మెరుగుదలను కలిగిస్తాయి. ఈ గృహాలు పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధికి దోహదపడతాయి.
5. ఎందరో వాస్తు నిపుణులు తమ జీవితాన్ని, అనుభవాలను కాచి వడపోసి వాస్తు శాస్త్రంలో ఎన్నో నూతన ఆవిష్కరణలు కావించారు. వాస్తుకు సరిగ్గా నిర్మించబడిన పశ్చిమాభిముఖ గృహాలు సానుకూల శక్తి ప్రవాహాన్ని ప్రవహింపచేస్తాయి. ఇది శుభ ఫలితాల విషయంలో సామరస్యపూర్వకమైన మరియు సమతుల్య జీవన వాతావరణానికి దారి తీస్తుంది. వాస్తుకు అనుకూలంగా వున్న పశ్చిమ గృహాలు విజ్ఞానం మరియు అభ్యాసాన్ని పెంపొందించడం వలన విద్యార్థులకు మరియు పండితులకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన ఎదుగుదల కోసం వెతుకుతున్న వ్యక్తులు పశ్చిమాభిముఖంగా ఉన్న గృహాలను లాభదాయకంగా మలచుకోవచ్చును, వాస్తుకు అనుకూలంగా వున్న కొన్ని పడమర నివాసములు, నివాసితుల ఆశయం మరియు సాధనకు మద్దతు ఇవ్వగలవు. దయచేసి అనవసర భయాలకు గురికావద్దు.
6. వ్యాపారవేత్తలకు, వ్యాపార విషయాలలో నిమగ్నమైన వ్యక్తులకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉండవచ్చును. వ్యాపారవేత్తలు పశ్చిమ దిశ యొక్క శుభవాస్తు కారణంగా ఆర్థిక స్థిరత్వం మరియు సంపదలో స్థిరమైన వృద్ధిని అనుభవించవచ్చు. వాస్తు రీత్యా నిర్మితమైన పశ్చిమముఖం గల గృహాలు, గృహస్థులు చేస్తున్న వృత్తిలో సంపద, ప్రగతిని మరియు శ్రేయస్సును ఆకర్షిస్తాయి. సంపద వృద్ధి కానవస్తున్నది. వృత్తి పురోగతి మరియు ప్రొఫెషనల్ వృద్ధి కోరుకునే వారికి ఈ దిశ ఉపయుక్తం.
7. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం మరియు శాంతియుత వాతావరం నెలకొని కుటుంబ జీవితం సాఫీగా గడిచె అవకాశం వున్నది. కుటుంబంలో అనవసర విషయాలపై దెబ్బలాడుకునే అవకాశాలు బాగా తగ్గిపోతాయి, అంతేకాకుండా సామరస్య వాతావరణం పెరిగి కుటుంబ సభ్యుల మధ్యలో బాంధవ్యాలు ప్రేమ అభిమానాలు పెరగడానికి అవకాశం హెచ్చు. వాస్తు రీత్యా సరైన రీతిలో నిర్మించబడిన పశ్చిమముఖం గల గృహాలు సానుకూల శక్తి ప్రవాహాన్ని కలిగివుంటాయి. కావున కుటుంబీకులు ఆనందకరమైన జీవితం అనుభవించడానికి అవకాశం ఉన్నది.
ఈ ప్రయోజనాలు వాస్తు సూత్రాలపై ఆధారపడి ఉన్నప్పటికీ, ఇంటి నిర్దిష్ట లేఅవుట్, వేర్వేరు గదుల నిర్మాణ విధానం, మరియు మొత్తం డిజైన్ వంటి వివిధ అంశాలపై ఆధారపడి చాలా సార్లు వాస్తవ ప్రభావం మారే అవకాశం గోచరిస్తున్నది. కాబట్టి, వ్యక్తీకరించిన సిఫార్సుల కోసం గృహస్థుల అభివృద్ధికై నిరంతరం హృదయపూర్వకంగా కష్టపడే వాస్తు నిపుణుడిని సంప్రదించడం వల్ల నివాసితులు తమ జీవన ప్రయాణాన్ని, సాఫీగా, ప్రశాంతంగా సాగిపోయేందుకు మార్గం సుగమం చేసుకోవచ్చు. దయచేసి ఇక్కడ ఒక విషయాన్ని శ్రద్ధగా గమనించండి. గృహమునందలి వాస్తు బాగా ఉన్నా, “పరిసర వాస్తు” సరిగా లేకపోతే ఫలితాల విషయంలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. సాధారణ గృహస్థులు “పరిసర వాస్తు” ప్రభావాలను అంత సులభంగా నిర్ణయించలేరు, బాగా అనుభవం కలిగిన వాస్తు నిపుణులు మాత్రమే తగిన సూచనలను ఇవ్వగలరు. కావున స్థలం కొనుబోయేముందు లేదా గృహం కొనుబోయేముందు ఒక మంచి వాస్తు నిపుణుని సంప్రదించండం వల్ల భవిష్యత్తులో గృహస్థులకే లాభం. 100 రూపాయలను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కొన్ని పైసల ఖర్చుకు వెనకాడరాదు. ఇస్తే వస్తుంది, ఈ చిన్న సూత్రం పాటించే గుజరాతీయులు అధిక ధనవంతులయ్యారు.
8. ఉత్తర ఈశాన్యం పెంపు కలిగిన పశ్చిమ దిశ గృహాలు మంచి ఫలితాలను ఇస్తాయా?
సాధారణంగా ఉత్తర ఈశాన్యం పెంపుకలిగిన గృహాలు మంచి ఫలితాలను గృహస్థులకు అందిస్తాయి. ఒకవేళ పశ్చిమ దిశ గృహానికి ఉత్తర ఈశాన్యం పెంపు ఉన్నట్లయితే ఆ గృహం, గృహస్థులకు ఎన్నో విషయాలలో అనుకూలమై, ఉత్తమ ఫలితాలను ఇవ్వగలదు, ఉత్తర ఈశాన్యం పెంపు వల్ల గృహస్థులకు అధిక ఆదాయం లభించవచ్చు, మంచి ఆరోగ్యం, భాగ్యం, భోగం, భవిష్యత్తు బంగారుమయం, బ్రతుకు, భవితవ్యం భద్రం, ఆనందకరమైన జీవితము లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీరు చేసే వ్యాపారం లాభాలలో నడవడమే కాకుండా, రెండవ వ్యాపారం కూడా ప్రారంభించే అవకాశం వుంది. వ్యాపారం లాభసాటిగా ఉండవచ్చును. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇంటి వాస్తు బాగున్నపుడే ఇవి సాధ్యం కావచ్చును. ఇంకో విషయం గమనించండి ప్రహరీ ఉంటే ఒక ఫలితం, ప్రహరీ లేకపోతే ఇంకో ఫలితం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

9. తూర్పు ఈశాన్యం పెరిగిన పశ్చిమ దిశ గృహాలను కొనవచ్చునా?
గృహానికి తూర్పు ఈశాన్య దిశలో స్థలం వృద్ధి చెందితే సాధారణంగా గృహస్థులకు శుభ ఫలితాలు లభిస్తాయి. పశ్చిమ దిశ గృహానికి తూర్పు ఈశాన్యం పెంపు ఉన్నట్లయితే ఆ గృహం, గృహస్థులకు ఎన్నో విషయాలలో అనుకూలమై, ఉత్తమ ఫలితాలను ఇవ్వగలదు. ఉదాహరణకు : తూర్పు ఈశాన్యం పెంపు వల్ల గృహస్థులకు మంచి పేరు రావడం, వారి ప్రతిష్ట పెరగడం, విదేశీయానం, పిల్లలకు మంచి విద్య రావడం జరగవచ్చును. నివాసితులు చేసే వ్యాపారాలలో అధిక ఆదాయం లభించవచ్చు, కుటుంబ సభ్యులమధ్య సఖ్యత, ఆనందకరమైన జీవితం, ఇల్లు స్నేహితులు మరియూ బంధువులతో కళ కళ లాడటం, దానధర్మం, సేవాగుణం, అయ్యోపాపం అనడం, ఇతరులకు సేవ చేసే గుణం ఉండడం, ఇతరత్రా లక్షణాలు కలిగివుండవచ్చును. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇంటి వాస్తు బాగున్నపుడే ఇవి సాధ్యం కావచ్చును. ఈ గృహానికి ప్రహరీ ఉంటే ఒక ఫలితం, ప్రహరీ లేకపోతే ఇంకో ఫలితం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

దయచేసి ఇక్కడ ఒక విషయాన్ని శ్రద్ధగా గమనించండి. గృహమునందలి వాస్తు బాగా ఉన్నా, “పరిసర వాస్తు” సరిగా లేకపోతే ఫలితాల విషయంలో కొన్ని మార్పులు రావచ్చును. సాధారణ గృహస్థులు పరిసర వాస్తు ప్రభావాలను అంత సులభంగా గమనించి నిర్ణయించలేరు, బాగా అనుభవం కలిగిన వాస్తు సిద్ధాంతులు మాత్రమే తగిన సూచనలను ఇవ్వగలరు. కావున స్థలం కొనుగోయేముందు లేదా గృహం కొనుగోయేముందు ఒక మంచి వాస్తు నిపుణుడి ని సంప్రదించి జీవితాన్ని అమృతమయం చేసుకోండి.
10. పశ్చిమ ద్వారం గృహానికి ప్రహరీలో ఈశాన్యం పెరిగితే మంచి ఫలితాలు వస్తాయా?
తెలిసో తెలియకనో జీవితంలో మనం చేసిన కొన్ని పుణ్య కార్యక్రమాల, కర్మ ఫలితాల వల్ల ఒక్కొక్కసారి మనకు తెలియకనే కొన్ని శుభ పరిణామాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు ఉన్న స్థలానికి ఈశాన్యం పెరిగినా, లేక ఈశాన్యం పెంచుకునే అవకాశం వచ్చింది అంటే జీవితంలో గృహస్థులకు యోగం మొదలవుతోందని తెలుసుకోవాలి. జీవితంలో అరుదుగా ఇటువంటి అవకాశాలు వస్తుంటాయి. ఇటువంటి అవకాశాలను ఏనాటికీ వదులుకోవద్దు. ఈ చిత్రంలో చూపినట్టుగా పశ్చిమ గృహనికి ఈశాన్యం పెరిగినప్పుడు, గృహస్థులకు యోగం మొదలైందని అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఉంటున్న గృహానికి ఈశాన్యం పెరిగినా లేక పెరిగిన ఈశాన్యం యొక్క స్థలాన్ని కొనుగోలు చేసినా భవిష్యత్తులో ఆ గృహస్తులు చాలా ప్రశాంతకరమైన జీవితాన్ని అనుభవించే అవకాశం అధికము, ఏప్పుడైనా సరే మీ జీవితంలో పెరిగిన ఈశాన్యం స్థలాలు లభిస్తే కాస్త ధర అధికమైనా కూడా కొనవచ్చును.

ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే గృహానికి ప్రహరీ ఉంటే ఒక ఫలితం ఒకవేళ ప్రహరీ లేకపోతే ఇంకో ఫలితం వస్తాయి. ఇటువంటి ఈశాన్యం పెరిగిన స్థలాలకు ప్రహరీ ఉంటే శుభ ఫలితాల ప్రభావము ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. కొందరు గృహస్తులు ఒక్కోసారి ఇలా చెబుతూ ఉంటారు మా ఇంటికి ఈశాన్యం బాగా పెరిగింది అయితే మాకు ఏ ఫలితాలు రావడం లేదని, ఒకవేళ “ప్రహరీ లేని పరిస్థితులలో ఈశాన్యం పెరిగినా” కూడా శుభ ఫలితాలు రాకపోవచ్చు. ఈత రావాలంటే సాధన చెయ్యాలి, అంతే కానీ, “నీటి కొలనులో ఈత ఎలా కొట్టాలి” అనే 2 లేదా 3 పుస్తకాలు చదివితే నీటిలో ఈత కొట్టటం రాదు, “ము ని గి పో తా రు” (ఇక్కడ సాధన ముఖ్యం). వాస్తు పుస్తకాలు చదివి నిర్ణయాలు తీసుకున్నా “ము ని గి పో వ చ్చు” (ఇక్కడ అనుభవం ముఖ్యం). ఈశాన్యం పెరిగిందా చాలు అనుకుంటే కుదరదు, మిగిలిన ఎన్నో విషయాలను గమనించి మాత్రమే ఒక నిర్ణయానికి రావాలి. ఇక్కడ ఈశాన్యం అనునది బండి చక్రమైతే ప్రహరీ అన్నది ఇరుసుగా భావించాలి, బండి చక్రం ఎంత ముఖ్యమో ఇరుసు కూడా అంతే ముఖ్యం కదా.
ఏది ఏమైనా మనకు తెలిసిన వాస్తు జ్ఞానం చాలా గొప్పగా ఉన్నా కూడా వాస్తు విషయానికి వచ్చినప్పుడు నిపుణుల మాట వినడం మనకు భవిష్యత్తులో మంచి చేస్తుందని గుర్తుపెట్టుకుంటే ఆ గృహస్థులకు యోగం ఉన్నట్టే అని అనుకోవచ్చు. ఎప్పుడైతే గృహస్తులు పుస్తకాలు చదివి లేక వీడియోలు చూసి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే భవిష్యత్తులో వారికి వచ్చే అద్భుతమైన జీవితాన్ని కాలదన్నుకుంటున్నారని తెలుసుకోవచ్చు. దాదాపుగా 2007 / 2008 సంవత్సరం వరకు గృహస్తులు వాస్తు సిద్ధాంతులు ఎలా చెబితే అలాగే పాటించేవారు. తర్వాత మార్కెట్లో వాస్తు పుస్తకాలు దొరకడం ఎక్కువైన తర్వాత వారే వాస్తు విజ్ఞానాన్ని బాగా ఔపాసనపట్టి సొంత నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్న కుటుంబాలను ఎంతోమంది “అనుభవజ్ఞులైన” వాస్తు సిద్ధాంతులు చూస్తూనే ఉంటారు. చెబితే వినరు. ఎవరి కర్మలను ఎవరు మార్చగలరు.
బుద్ధిః కర్మానుసారిణీ. మనసు మన ప్రధాన సంపద. అది సకారాత్మకంగా ఉపయోగించుకున్నామా, లేక నాశనాత్మకంగానా అనేది మన చేతుల్లోనే ఉంది. మనసును మిత్రుడిగా మార్చుకోగలిగిన వారికి విజయాలు తధ్యం. అయితే, మనసును శత్రువులా మార్చుకున్న వారు నాశనానికి గురికావచ్చు. మన ప్రవర్తన, మన ఆలోచనలపై ప్రభావం చూపే మన మనస్సు, మనకు మార్గదర్శిగా ఉండగలదు. పాజిటివ్ దృక్పథంతో మనసును నియంత్రించడం మన చేతిలో ఉన్న శక్తి. ఇంద్రియాలను అదుపులో ఉంచి, వాటి ఆకర్షణలను విజయంగా మార్చుకోవడం మన జీవితంలో కీలకం. మనమే మన జీవితంలో విజయాలకు, వైఫల్యాలకు కారణం. మనం మన మనసును ఎలా నడిపిస్తామో ఆ ప్రకారంగానే మన జీవితం ఆకారం తీసుకుంటుంది. పరిస్థితులను మార్చుకోగల శక్తి మనలోనే ఉంది.
11. ఈశాన్యం తెంపు కలిగిన పశ్చిమ దిశా గృహాన్ని కొనవచ్చా?
సంక్షిప్తంగా సమాచారమును ఇచ్చే పనిలో వున్నాము, దయచేసి కొద్ది సమయం తరువాత రండి. శుభదినం.

– : పడమర దిశ గృహ వాస్తు పై కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు : –
ఇక్కడ పశ్చిమ దిశ గృహాలపై గృహస్థులకు వచ్చే కొన్ని ప్రశ్నలు ప్రచురించడం జరిగినది, మరియు వాటికి సమాధానాలను కూడా ఇచ్చాము. ఒకవేళ మీకు పడమర గృహాల వాస్తుపై ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మమ్మల్ని నిరభ్యంతరంగా సంప్రదించండి, సంబోధన సంస్కారవంతంగా ఉంటే తప్పకుండా సమాధానం ఇవ్వగలము. ఒకవేళ మీ ప్రశ్న సమాజానికి పనికి వచ్చే రీతిలో ఉన్నట్లయితే ఆ ప్రశ్న మరియు దానికి సంబంధించిన సమాధానం కూడా ఇక్కడ ప్రచురించడం జరుగుతుంది. ఒకవేళ మీకు సమ్మతం అయితే మీ పేరు / ఊరు ప్రచురిస్తాము. మీ ఒప్పుదల లేకుండా మీ పేరు ప్రచురించబడదు.
1. గృహానికి పశ్చిమ దిశలో బావులు, చెరువులు, కుంటలు, వాగులు, కాలువ ప్రవాహాలు ఉండడం మంచిదేనా?
వాస్తు శాస్త్ర రీత్యా గృహములకు పశ్చిమ దిశలో లోతైన ప్రాంతాలు ఉండడం మంచిది కాదు. ఇంటికి పశ్చిమ దిశలో వాగులు, కుంటలు, నీటి ప్రవాహాలు, ఉండడం వల్ల అశుభ లక్షణాలు కనిపించవచ్చు. ఉదా : – అనుకున్న పనులు జరగకపోవడం, ఆరోగ్యం నాశనమైపోవడం, పెద్ద పెద్ద అనారోగ్యాలతో భాదలను అనుభవించడం, ధనం కోల్పోవడం, సంపద ఆవిరైపోవడం, ఆనందం లేకుండా పోవడం, జీవనోపాధి కోల్పోవడం, మానసిక అశాంతి, కావలసిన స్నేహితులు, బంధువులు, దూరమైపోవడం, ఆసుపత్రికి తరచూ వెళ్లడం, అపజయం, పట్టుకున్న కార్యక్రమాలు సజావుగా జరగకపోవడం, శత్రువులు పెరగడం, కిరాయి సరిగా రాకపోవడం, లేక కిరాయి కట్టే స్థోమత కూడా లేకుండుట, ఇత్యాది విషయాలు అనుభవం లోకి రావచ్చును.

– : దాతల సమాచారం : –
ఎంతోమంది గృహస్థులకు తమకు జన్మనిచ్చి, ఉన్నతంగా తీర్చిదిద్దిన తమ తల్లిదండ్రుల పేర్లను లేదా తమ పెద్దల పేర్లను చిరస్థాయిగా ఈ సమాజంలో నిలిచిపోయెందుకు భారీ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది చాలా మంచి పరిణామము, మరియు వీరి ఆలోచన అద్భుతం, అపూర్వ సృజనాత్మకత. ఒక వేళ మీకంటూ ఇటువంటి ఆలోచన ఉన్నట్లయితే మీ లోకల్ లాంగ్వేజ్ లో వెబ్సైట్ తయారవుతున్నది. మీరు మీ పెద్దల పేర్లను చిరస్థాయిగా ఈ సమాజంలో నిలిపి ఉంచడానికి, వారి పేర్లు, పేర్లతో పాటుగా చిత్రపటములను కూడా ముద్రిస్తాము. ఈ వెబ్సైటు ఉన్నంతకాలం మీ పేరు, లేదా మీ తల్లితండ్రుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. మొత్తం వెబ్ సైట్ అంతయు మీరు స్పాన్సర్ చేయవచ్చు. లేదా ఒక ప్రత్యేకమైన పేజీ ను స్పాన్సర్ చేయవచ్చు. సింగల్ టైం పేమెంట్ మాత్రమే. ప్రతి సంవత్సరం కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు స్పాన్సర్ చేయాలని అనిపిస్తే ఈ లింకు ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు, తదుపరి మిగిలిన సమాచారంను అందజేయగలము. https://www.subhavaastu.com/contact-us.html
– : SPONSORSHIP : –
Many residents are committed to honoring the names of their parents, grandparents, or elders, with the aim of keeping their legacy vibrant in their respective societies. This admirable effort is truly heartening. If you feel a connection to this endeavor, our website, thoughtfully crafted in your native language, offers a supportive platform while deeply respecting your sentiments. We are dedicated to helping you ensure that the names of your loved ones are remembered with respect and fondness. You have the option to sponsor either the entire website or a specific page, all with a single payment, freeing you from the concern of annual fees. In doing so, the names of those dear to you will be cherished and celebrated for as long as our website continues to exist. If you’re interested in this meaningful tribute, please contact us for more information : https://www.subhavaastu.com/contact-us.html